అమృత్‌సర్: పాకిస్తాన్ టూర్‌లో తమకు మంచి ఆతిథ్యం లభించిందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లాహోర్‌లో ఏర్పాటు చేసిన ఆసియా కప్ అధికారిక విందుతో పాటు కొన్ని మ్యాచ్‌లకు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో కలిసి బిన్నీ హాజరయ్యారు. బీసీసీఐ ప్రతినిధులు పాక్ టూర్‌కు వెళ్లడం 17 ఏండ్ల లో ఇదే తొలిసారి. పాక్ టూర్ ముగించుకొని బుధవారం వాఘా బార్డర్ మీదుగా వీరు ఇండియా తిరిగొచ్చారు. ‘పాక్‌లో మీటింగ్ బాగా జరిగింది. మాకు మంచి ఆతిథ్యం లభించింది.
మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. క్రికెట్ చూడటం, వారితో కూర్చుని చర్చించడమే మా ప్రధాన ఎజెండా. మొత్తమ్మీద ఈ టూర్ బాగా సాగింది. పీసీబీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. మేం సౌకర్యవంతంగా ఉండేలా చేసింది’ అని బిన్నీ చెప్పారు. ఇక, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ ఒక్కటే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అంతవరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు. వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పాక్.. ఇండియా వస్తున్న నేపథ్యంలో ద్వైపాక్షిక క్రికెట్ కూడా రీస్టార్ట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.