
- టీచర్లకు బీసీటీఏ స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణుడు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : కరీంనగర్– ఆదిలాబాద్– నిజామాబాద్– మెదక్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి, బీసీ నేత మల్క కొమరయ్యను గెలిపించాలని బహుజన క్లాస్ టీచర్స్అసోసియేషన్ (బీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు కోరారు. హైదరాబాద్ లో బీసీటీఏ, టీఆర్టీయూ, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ.. బహుజన నేత మల్క కొమురయ్యను టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు బీసీ టీచర్లంతా చేయుతనివ్వాలని కోరారు.
బీసీ బహుజన ఉపాధ్యాయ, అధ్యాపకులు.. ఈ ఎన్నికల్లో మన ఓటు మన అభ్యర్థికే అనే నినాదంతో ముందుకు పోయి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ ఎన్నికల్లో కొమరయ్య గెలిస్తేనే.. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం కోసం ఇది తొలి అడుగుగా భావించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్ యాదవ్, పీటీఏ స్టేట్ ప్రెసిడెంట్ బడేసాబ్, బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, తిరుపతి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.