బెల్లంపల్లిలో ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీ తొలగించడంపై నిరసన

బెల్లంపల్లిలో ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీ తొలగించడంపై నిరసన

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ఫ్లెక్సీ చించివేశారని బెల్లంపల్లి నేతలు నిరసనకు దిగారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్డుపై, అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం స్థానిక మైనార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించి చెత్త బండిలో వేశారు. ఈ చర్యను మైనార్టీ నేతలు ఖండించారు. 

ప్రేమ్ సాగర్ రావుపై అభిమానంతో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా తాము  పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం సరికాదన్నారు. దీనిపై కమిషనర్ సమాధానం చెప్పాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న పార్టీ నేతలు వారిని సముదాయించడంతో ఆందోళన విరమించారు. తిరిగి మున్సిపల్ సిబ్బందితో ఫ్లెక్సీని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది.