- అశతో ఎదురు చూస్తున్న సింగరేణి ప్రాంత వాసులు
- ఇంకా ఇవ్వాల్సిన పట్టాలు దాదాపు 2 వేలు
- ఎమ్మెల్యే చొరవ చూపాలని ప్రజల వేడుకోలు
నస్పూర్, వెలుగు:నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్న లబ్ధిదారులు ఆ ఇండ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. సింగరేణి ప్రాంతలో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ప్రత్యేక జీవో 187 జారీ చేసి పట్టాలు అందించింది. అయితే కొన్ని కాలనీలను సింగరేణి సంస్థ రెవెన్యూ శాఖకు అప్పగించకపోవడంతో ఆ కాలనీలకు పట్టాలు దక్కలేదు. పట్టాలు పొందినవారు పక్కా ఇండ్లు నిర్మించుకుంటుండగా.. రానివారి ఆశతో ఎదురుచూస్తున్నారు.
2835 మందికి మాత్రమే పట్టాలు
శ్రీరాంపూర్ ఏరియాలోని 180.13 ఎకరాలను సింగరేణి సంస్థ రెవెన్యూకు అప్పగించింది. అందులో ఇండ్ల పట్టాల కోసం మొదటి విడతగా 3261 అప్లికేషన్స్, రెండవ విడతలో 560 ధరఖాస్తులు మొత్తంగా 3821 వచ్చాయి. అందులో నుంచి 2835 మందికి మాత్రమే పట్టాలు అందించారు. ఇంకా 986 మందికి పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అందులో నుంచి కొన్ని రిజెక్ట్ కాగా, ఇంకొన్ని కాలనీలను రెవెన్యూకు అప్పగించి సర్వే చేయాల్సి ఉంది.
ప్రస్తుతం దాదాపు వెయ్యి వరకు రిజక్ట్ చేయడం, సర్వే కానివి మరో వెయ్యి ఉండగా మొత్తంగా ఇంకా రెండు వేల వరకు పట్టాలు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వం, సింగరేణి ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయి శ్రీరాంపూర్ ఏరియాలో చాలా కాలంగా ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇప్పించాలని పలువురు కోరుతున్నారు.
స్థానికుల ఎదురుచూపులు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీల నేతలు పట్టాలిప్పిస్తామని ప్రచారం చేశారు. గతంలో విడతల వారీగా మున్సిపాలిటీ పరిధిలో పట్టాలు పంపిణీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు విజయం సాధించడంతో.. ఆయన చొరవ తీసుకొని పట్టాలు ఇప్పించాలని ప్రజలు కోరుతు న్నారు. గతంలో పట్టాలు పొందిన వారు పక్కా ఇండ్లు నిర్మించుకుంటుంటే తాము ఎదురు చూస్తున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా చొరవ తీసుకొని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.
హమీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారికి పట్టాలు ఇస్తామని లీడర్లు హామీలు ఇచ్చారు. వారి మాటలు నమ్మి ఓటు వేశాం. ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు.- పోట్లసేర్ల రవి, స్థానిక యువకుడు
40ఏళ్లుగా నివాసం ఉంటున్నాం
సింగరేణిలో పని చేసి పదవీ విరమణ పొందాను. 40 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నం. తాత్కాలిక ఇంటిలోనే ఉంటూ అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం. భూ సర్వే చేసి పట్టాలివ్వాలి.పెసర్ శంకరమ్మ, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి