పెట్రోల్ నీ బాబు ఇస్తాడా : రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళను కొట్టిన ఆటో డ్రైవర్

ఓ మహిళ.. తన ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్లాలని అనుకున్నారు.. పీక్ అవర్స్ కావటంతో ఆటో బుక్ కావటానికి చాలా టైం పడుతుందన్న ఉద్దేశంతో.. ఇద్దరూ ఓలాలో ఆటో బుక్ చేశారు.. ఏ ఆటో ముందు వస్తే.. ఆ ఆటోలో వెళ్లాలనే ఆలోచన వారిది.. తీరా ఇప్పుడు ఇదే పెద్ద వివాదానికి.. పెద్ద చర్చకు దారి తీసింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు సైతం ఇప్పుడు భిన్నంగా స్పందిస్తున్నారు.. కొంత మంది ఆటోవాలాను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆ మహిళను సమర్థిస్తున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరు సిటీలోని ఓ యువతి ఓలా యాప్ లో ఆటో బుక్ చేసింది. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటో.. స్పాట్ కు చేరుకోవటానికి 15 నిమిషాలు పట్టింది. తీరా ఆటోడ్రైవర్.. బుకింగ్ పాయింట్ దగ్గరకు రాగానే రైడ్ క్యాన్సిల్ చేసింది ఆ యువతి.. దీంతో ఆటోడ్రైవర్ కు తీవ్ర కోపం వచ్చింది.. 

రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశావ్.. పెట్రోల్ ఊరికే వస్తుందా.. నీ బాబు ఇస్తాడు పెట్రోల్ అంటూ కోపంగా ఊగిపోయాడు. ఆ యువతిపై చేయిచేసుకున్నాడు.. మాటామాటా పెరిగే యువతిని చెంప దెబ్బ కొట్టాడు ఆటోడ్రైవర్.. రోడ్డుపై జరుగుతున్న ఈ వ్యవహారాన్ని చూస్తున్న మిగతా ఆటోడ్రైవర్లు, స్థానికులు జోక్యం చేసుకుని ఆటోడ్రైవర్ ను కూల్ చేశారు. 

దీనిపై యువతి.. పోలీసులకు కంప్లయింట్ చేస్తాను అనటంతో.. ఆటోడ్రైవర్ మళ్లీ రెచ్చిపోయాడు. పదా పోదాం పోలీసుల దగ్గరకు.. ఆటో రైడ్ క్యాన్సిల్ వల్ల నాకు వచ్చిన నష్టాన్ని నీ బాబు ఇస్తాడా అంటూ మళ్లీ రెచ్చిపోయాడు.. దీంతో చేసేది లేక ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

ఈ వ్యవహారాన్ని మొత్తం రికార్డ్ చేసిన ఆ యువతి.. సోషల్ మీడియాలో పోలీసులను ట్యాగ్ చేస్తూ కంప్లయింట్ చేసింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 4 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఆటో రైడ్ ను ఎలా క్యాన్సిల్ చేస్తారు.. ఆటోడ్రైవర్ ప్రశ్నించినట్లు.. పెట్రోల్ ఊరికే వస్తుందా.. అందులోనూ బెంగళూరు సిటీలో పీక్ అవర్స్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదా అంటూ ఆ యువతినే తిట్టిపోస్తున్నారు..

మరికొందరు మాత్రం ఆటోడ్రైవర్ చర్యకు ఖండిస్తున్నారు. ఓలా యాప్ వాళ్లను అడగాలి కదా.. ఆ యువతి ఇష్టం.. యాప్ లో క్యాన్సిల్ ఆప్షన్ ఉంది.. క్యాన్సిల్ చేసింది.. ఇంత మాత్రానికి యువతిని కొడతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసులు మాత్రం సామరస్యపూర్వకంగా ఇలా సమాధానం ఇచ్చారు. ఇలాంటి చర్యల వల్ల బెంగళూరు సిటీకి చెడ్డపేరు వస్తుంది.. ఒకరిద్దరు చేసే ఇలాంటి పనుల వల్ల ఆటోడ్రైవర్లకు సంఘానికి చెడ్డపేరు వస్తుంది.. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదంటూ సెలవిచ్చారు. జరిగిన ఘటనపై చర్యలు తీసుకుంటామని వివరించారు బెంగళూరు సిటీ పోలీసులు.