గచ్చిబౌలిలో బ్లఫ్​ మాస్టర్

గచ్చిబౌలిలో బ్లఫ్​ మాస్టర్
  • గోల్డ్​ కొంటానంటూ ఇద్దరు జ్యువెలరీ వ్యాపారులకు మస్కా
  •  50 తులాల గోల్డ్​ బిస్కెట్లు, 18 వేల అమెరికన్ డాలర్లతో పరార్

గచ్చిబౌలి, వెలుగు: బంగారం కొంటానని నమ్మబలికి బెంగళూరుకు చెందిన వ్యక్తి ఇద్దరు జ్యువెలరీ వ్యాపారులను మోసం చేశాడు. 50 తులాల గోల్డ్​బిస్కెట్లు, 18 వేల అమెరిన్ డాలర్లతో పరారయ్యాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్సింగికి చెందిన చంద్రశేఖర్​జ్యువెలరీ వ్యాపారి. సిటీలోని హోటళ్లలో బస చేసే వారిని కలిసి బంగారు ఆభరణాలను విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఈనెల 20న గచ్చిబౌలి డీఎల్ఎఫ్ సమీపంలోని సితార హోటల్​కు వెళ్లాడు. అక్కడ బస చేస్తున్న డి.స్టీవ్ గాడ్విన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మాటల్లో తనకు 50 తులాల బంగారం బిస్కెట్లు, 18 వేల అమెరిన్ డాలర్లు కావాలని స్టీవ్ గాడ్విన్ అడిగాడు. అతని మాటలు నమ్మిన చంద్రశేఖర్ లింగంపల్లికి చెందిన తన స్నేహితుడైన మరో వ్యాపారి రఫీకి ఫోన్​చేసి విషయం చెప్పాడు. 

స్టీవ్ గాడ్విన్ కోరిన విధంగా బంగారం, అమెరిన్ డాలర్లను సిద్ధం చేసి 21న అతనికి ఫోన్ చేశారు. గచ్చిబౌలిలోని సెంట్రల్ మాల్ లోని తన ఆఫీసుకు రావాలని స్టీవ్ గాడ్విన్ చెప్పడంతో చంద్రశేఖర్, రఫీ బంగారం, డాలర్లను తీసుకొని అక్కడికి వెళ్లారు. వారిని తన యాక్సెస్​కార్డుతో సెంట్రల్ మాల్ బిల్డింగ్​నాలుగో అంతస్తులోని అద్దాల గదిలోకి స్టీవ్​గాడ్విన్​తీసుకెళ్లాడు. 50 తులాల గోల్డ్​బిస్కెట్లు, 18 వేల అమెరిన్ డాలర్లు తీసుకుని.. డబ్బు తెస్తానని లోపలికి వెళ్లాడు. తర్వాత కొద్దిసేపటికి గోల్డ్, డాలర్లతో స్టీవ్​గాడ్విన్ వెళ్లిపోతున్నట్లు అద్దాల్లో కనిపించాడు. 

మోసపోయామని తెలుసుకున్న వ్యాపారులు బయటకు వచ్చి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. యాక్సెస్ కార్డు లేకపోవడంతో బయటకురాలేకపోయారు. చూస్తుండగానే స్టీవ్ గాడ్విన్​కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయటపడిన బాధితులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కారును ట్రేస్​చేశారు. కొండాపూర్ లో కానును అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. అద్దెకు తీసుకున్న సమయంలో నిందితుడు ఇచ్చిన పాస్ ఫోటో, గుర్తింపు కార్డు ఆధారంగా బెంగళూరుకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.