కర్ణాటకలో హిందీ వర్సెస్ కన్నడ చర్చను దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. తాజాగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు తమ సైన్‌బోర్డ్‌లలో కనీసం 60 శాతం కన్నడ భాషలోనే ఉండేలా చూసుకోవాలని మహానగర పాలికే ఆదేశాలు జారీ చేసింది. పౌర సంస్థ పరిధిలోని వాణిజ్య దుకాణాలు సైన్‌బోర్డ్ ఆర్డర్‌ను పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బృహత్ బెంగళూరు మహానగర పాలికే చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ తెలిపారు.
అన్ని దుకాణాలు తమ నేమ్ బోర్డులపై కన్నడ భాషనే ఉపయోగించాలని బీబీఎంపీ ప్రకటించింది. పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నగరంలో సైన్ బోర్డులపై కన్నడ భాష వినియోగానికి సంబంధించి నిబంధనలు పాటించని దుకాణాలను గుర్తించడానికి అధికారులు సర్వే చేపట్టనున్నారు. నగరంలో 1400 కి.మీ మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు ఉన్నాయని, ఈ రోడ్లపై ఉన్న అన్ని వాణిజ్య దుకాణాలను మండలాల వారీగా సర్వే చేసి.. సర్వే అనంతరం సైన్ బోర్డుల్లో 60 శాతం కన్నడ భాష వాడని దుకాణాలకు నోటీసులు ఇస్తామని తుషార్ గిరి నాథ్ చెప్పారు.
కన్నడ భాషా నేమ్‌ప్లేట్‌లను అమలు చేయడానికి, సంబంధిత జోన్ కమిషనర్‌లకు పర్మిషన్ లను సమర్పించడానికి వారికి ఫిబ్రవరి 28 వరకు సమయం ఇస్తామని తుషార్ తెలిపారు. ఫిబ్రవరి 28లోగా కన్నడ నేమ్‌ప్లేట్‌లు ఏర్పాటు చేయని దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లేదంటే దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.