భద్రాచలం మన్యంలో 35 ట్రాన్స్​ఫార్మర్లు ధ్వంసం

  •     పగలు రెక్కీ చేసి.. రాత్రిళ్లు రెచ్చిపోతున్న దొంగలు 
  •     పక్కా ప్లాన్​తో లక్షల విలువ చేసే కాపర్, ఆయిల్ చోరీ
  •     ఏడాదిలో విద్యుత్​శాఖకు భారీగా నష్టం 

భద్రాచలం, వెలుగు : కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మన్యంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పంట పొలాల్లోని ట్రాన్స్​ఫార్మర్లను టార్గెట్​చేసి విలువైన కాపర్ ఎత్తుకెళ్తున్నారు. గడిచిన ఏడాదిలో 35 ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేశారు. వరుస ఘటనలు పోలీసులకు సవాల్ గా మారాయి. దుండగులు పక్కా ప్లాన్​తో కరెంట్ సరఫరా నిలిపేసి కాపర్​చోరీ చేస్తున్నారు. పగలు రెక్కీ నిర్వహించి ఎక్కడెక్కడ ట్రాన్స్​ఫార్మర్లు ఉన్నాయో గుర్తిస్తున్నారు. అదును చూసి రాత్రిళ్లు రెచ్చిపోతున్నారు. ఇదంతా ప్రొఫెషనల్ దొంగల పనేనని, విద్యుత్​సరఫరా, కనెక్షన్స్​పై పూర్తిగా అవగాహన ఉన్న వారే చోరీలకు పాల్పడుతున్నారని ట్రాన్స్ కో అధికారులు అంటున్నారు.

దాదాపు రూ.20 లక్షల కాపర్​చోరీకి గురైందని చెబుతున్నారు. ఇటీవల దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన కొమరం దామోదరరావు అనే రైతు పొలంలో ఏర్పాటు చేసుకున్న 25 కెపాసిటీ ట్రాన్స్ ఫార్మర్​ను దొంగలు కిందికి దించి ధ్వంసం చేశారు. అందులోని కాపర్, కరెంట్ ఆయిల్ ఎత్తుకుపోయారు. కిందటేడు ఇదే రైతుకు చెందిన కరెంట్​మోటారు వద్ద 600 కాపర్ వైర్ చోరీకి గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పినపాకలోనే ఎక్కువ

భద్రాచలం ట్రాన్స్ కో డివిజన్‍ పరిధిలోని పినపాక నియోజకవర్గంలోనే ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అశ్వాపురం మండలంలో 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు 15 ధ్వంసమయ్యాయి. దుండగులు వెంకటాపురంలో ఒకటి, తుమ్మలచెరువు ఆయకట్టు కింద ఒకటి, మొండికుంటలో 2, పాలవాగు వద్ద ఒకటి చోరీ చేశారు. పూర్తిస్థాయిలో వరి సాగు పూర్తిస్థాయిలో మొదలుకాకపోవడం దొంగలకు కలిసొస్తోంది. గత నెలలో దుమ్ముగూడెం మండలం చినకమలాపురం, ఆర్లగూడెం గ్రామాల్లోని ట్రాన్స్ ఫార్మర్లను పగలగొట్టిన కాపర్​ఎత్తుకెళ్లారు. బూర్గంపాడు మండలంలో మూడు ట్రాన్స్ ఫార్మర్లను చోరీ చేశారు.కరకగూడెం మండలం బట్టుపల్లిలోని శ్మశానవాటిక ఎదురుగా ఉన్న పొలాల్లోని ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లారు. అల్యూమినియం తీగలను వదిలేసి కాపర్​ను మాత్రమే చోరీ చేస్తున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లు, కండక్టర్లను కూడా వదలట్లేదు.

ఒక్కో 25 కిలోవాట్​ట్రాన్స్​ఫార్మర్​లో సుమారు 30 కిలోల కాపర్​వైరు ఉంటుంది. దాని విలువ బయటి మార్కెట్​లో రూ.80 వేలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైతులతోపాటు, విద్యుత్​శాఖకు తీవ్ర నష్టం కలుగుతోందని వాపోతున్నారు. బయట జిల్లాల నుంచి వచ్చి ఇక్కడి ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేస్తున్నారని ట్రాన్స్ కో అధికారులు అనుమానిస్తున్నారు. త్రీఫేజ్ కరెంట్​సరఫరా అవుతున్నా.. ట్రాన్స్​ఫార్మర్​ను కిందికి దించుతున్నారంటే పక్కా ప్రొఫెషనల్స్​పనేనని చెబుతున్నారు. వాగులు, వంకలు, ఊరికి దూరంగా ఉన్న పంట పొలాల్లోని ట్రాన్స్ ఫార్మర్లను టార్గెట్​చేస్తుండడం పోలీసులకు సవాలుగా మారింది.

పోలీసులకు ఫిర్యాదు చేశాం

ట్రాన్స్ ఫార్మర్ల ధ్వంసంపై అశ్వాపురం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, కరకగూడెం పోలీస్‍స్టేషన్లలో ఫిర్యాదు చేశాం. దుండగులు ఇప్పటివరకు 35 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేశారు. కాపర్​ఉంటేనే ఎత్తుకెళ్తున్నారు. అల్యూమినియం ఉంటే అక్కడే వదిలేసి పోతున్నారు. విద్యుత్​శాఖకు లక్షల్లో నష్టం వాటిల్లింది. రైతుల ఇబ్బందులు పడకుండా వెంటనే కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం.

- జీవన్‍కుమార్, ట్రాన్స్ కో డీఈ, భద్రాచలం