![ఎలివేటెడ్రోడ్డు నిర్మాణానికి జియోఫిజికల్ సర్వే](https://static.v6velugu.com/uploads/2025/02/elevated-road-construction-to-begin-soon_HhYy9Jqs15.jpg)
- నేషనల్ హైవే.. కూనవరం రోడ్డులో మిగులు కరకట్ట పనుల పూర్తికి చర్యలు
- మూడు రోజులుగా బ్లూ ఎనర్జీ బిల్డ్ ప్రైవేటు లిమిటెడ్పనులు
- 80 అడుగుల వరద వచ్చినా కాలనీల వైపు నీళ్లు రాకుండా నిర్మాణం
- ఈ ఏడాది జూన్‌లోపు నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం టౌన్లో మిగులు గోదావరి కరకట్ట నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. రూ.38కోట్ల వ్యయంతో 700 మీటర్ల పొడవున టౌన్ చుట్టూ ఈ కట్ట పనులు జరుగుతున్నాయి. కూనవరం రోడ్డు శివారున ఈ కరకట్ట మీదుగా విజయవాడ–-జగదల్పూర్ నేషనల్ హైవే వెళ్లాల్సి ఉంది. దీనిలో భాగంగా హైవేపై 13 మీటర్ల ఎత్తులో కరకట్ట వస్తున్నందున ఎలివేటెడ్రోడ్డు 1.3కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉంది. అందుకోసం ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు డిజైన్లు రూపొందించి ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీకి పంపించారు.
వారి అనుమతి కావాలంటే ఆ ప్రాంతంలో సాయిల్ టెస్ట్ చేయించాల్సి ఉంది. దీనితో మూడు రోజులుగా ఇరిగేషన్ ఇంజినీర్లు బ్లూ ఎనర్జీ బిల్డ్ ప్రైవేటులిమిటెడ్ కన్సల్టెన్సీ ద్వారా జియోఫిజికల్ సర్వేను నిర్వహిస్తున్నారు. భూమి లోపల ఎంత లోతులో రాళ్లతో పొరలు ఉన్నాయి? లూజు సాయిల్ ఏ మేర ఉంది? అనే అంశాలను స్టడీ చేస్తున్నారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ జాతీయ రహదారిపై నిత్యం వేల టన్నుల బరువుతో వాహనాలు తిరుగుతుంటాయి. దీనితో కరకట్ట మీదుగా నిర్మించే ఈ ఎలివేటెడ్ రోడ్డు పటిష్టంగా ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
80 అడుగుల వరద వచ్చినా..
గోదావరి వరదల సమయంలో భద్రాచలం వద్ద 80అడుగుల వరద వచ్చినా భద్రాచలంలోని శాంతినగర్, కూనవరం రోడ్డు, సుభాష్‌నగర్ కాలనీల వైపు నీరు రాకుండా ఉండేందుకు 700 మీటర్ల మిగులు కరకట్టను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే కరకట్ట డిజైన్‌లో ఎలివేటెడ్ రోడ్డును చేర్చారు. 2025 జూన్ నాటికి ఈ నిర్మాణం పూర్తి చేసేలా ఇరిగేషన్ శాఖ పనులు చేపడుతోంది. ఇందు కోసం తాజాగా 2.50ఎకరాల భూమిని కూడా సేకరించారు. పాతకరకట్ట బేస్ 53 మీటర్లు ఉండగా మిగులు కరకట్ట బేస్‌ను 65 మీటర్లకు పెంచారు. కట్ట ఎత్తు గతంలో 12.50 మీటర్లుంటే ఇప్పుడ 13 మీటర్లు ఉంటుంది. ఇందు కోసం రూ.40కోట్లను వెచ్చిస్తున్నారు. 1986లో వచ్చిన 75.6 అడుగుల గోదావరి వరదను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణం డిజైన్‌ను రూపొందించారు. 80 అడుగులు వరద వచ్చినా పట్టణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మళ్లీ సాయిల్ టెస్ట్ అడిగారు
ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ మళ్లీ సాయిల్ టెస్టు అడిగారు. గతంలో ఒకసారి టెస్టు రిపోర్టు ఇచ్చాం. వాళ్లు సంతృప్తి చెందలేదు. అక్యురేటెడ్గా కావాలని అడిగారు. అందుకే తాజాగా జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తున్నాం. రిపోర్టు ఇవ్వగానే రోడ్డు నిర్మాణ డిజైన్లకు ఆమోదం లభిస్తుంది. వెంటనే పనులు చేపడతాం.- రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్ శాఖ