స్వర్ణ కవచధారి రామయ్యకు విశేష పూజలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు స్వర్ణ కవచాల్లో దర్శనం ఇచ్చారు. ముందుగా సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించాక మూలవరులను బంగారు కవచాలతో అలంకరించి హారతులు సమర్పించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. బేడా మండపంలోకి కల్యాణమూర్తులను తీసుకొచ్చి నిత్య కల్యాణం చేశారు.

 శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్​స్వామి భద్రాద్రిరామయ్యను దర్శించుకున్నారు. పూజలు చేసి భక్తులకు ప్రవచనం చెప్పారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం సంధ్యాహారతిని ఇచ్చారు. కల్కి అవతారంలో రామయ్యను అలంకరించి రాజవీధిలోని విశ్రాంతి మండపంలోనికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేసి రాపత్​ సేవను నిర్వహించారు. తిరువీధి సేవగా గోవిందరాజస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయానికి స్వామి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద దొంగలదోపు ఉత్సవం ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని తిలకించారు.