భద్రాచలం, బూర్గంపహాడ్​ మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలకు ఓకే

భద్రాచలం, బూర్గంపహాడ్​ మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలకు ఓకే
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెరిగిన 22 ఎంపీటీసీ స్థానాలు
  • జిల్లాలో కొత్తగా ఏర్పడిన భద్రాచలం జడ్పీటీసీ
  • మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండేలా చర్యలు
  • బ్యాలెట్​ పేపర్లు, పోలింగ్​ కేంద్రాల గుర్తింపులో ఆఫీసర్లు నిమగ్నం
  • పోలింగ్​ఆఫీసర్లు, సిబ్బంది నియామకాలపై కసరత్తు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు సర్పంచ్​ ఎన్నికలకు జిల్లా పంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్​  ఆఫీసర్లు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈసారి జిల్లాలోని భద్రాచలం, బూర్గంపహాడ్​ మండలాల్లోనూ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. ప్రతి మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా అవసరమున్న చోట ఎంపీటీసీ స్థానాలను పెంచారు. జిల్లాలో కొత్తగా 22 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. మరో వైపు అశ్వారావుపేటను మున్సిపాలిటీగా ప్రభుత్వం మార్చడంతో ఆరు ఎంపీటీసీ స్థానాలు  తొలగించారు. 

ఈసారి భద్రాచలం, బూర్గంపహాడ్ లోనూ ఎన్నికలు 

గతంలో భద్రాచలం, బూర్గంపహాడ్​ మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన కొత్తలో భద్రాచలాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ ఆనాడు ప్రతిపాదనలు రూపొందించారు. కానీ మున్సిపాలిటీ ఏర్పాటు కాలేదు. ఈ క్రమంలో గత ఐదేండ్లుగా భద్రాచలానికి ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజనలో భాగంగా బూర్గంపహాడ్​లోని కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్​లో విలీనం కావడం, కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మండలంలోనూ ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. దీంతో భద్రాచలం, బూర్గంపహాడ్​ మండలాలకు ఎంపీపీలు, ఎంపీటీసీలు లేకుండానే ఐదేండ్లు గడిచాయి. 

ఇప్పుడు భద్రాచలాన్ని మండలంగా ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించడంతో ఎంపీటీసీ ఎన్నికలకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. అలాగే బూర్గంపహాడ్​ మండలంలోని సారపాకను మండలంగా మారుస్తున్నట్టు గత ప్రభుత్వం పేర్కొనడం, అది ప్రాతిపాదనలకే పరిమితం కావడంతో ఎన్నికలు చర్చానీయాంశంగా మారాయి. ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం సారపాకను గ్రామపంచాయతీగానే ప్రకటించడంతో పాటు బూర్గంపహాడ్​ మండలంలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఆఫీసర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కొత్తగా 22 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ..

జిల్లాలో కొత్తగా 22 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ప్రతి మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా ఆఫీసర్లు ప్లాన్​ చేశారు. ఈ క్రమంలోనే ఆళ్లపల్లి, కరకగూడెం మండలాల్లో ఒక్కొక్క ఎంపీటీసీ స్థానం పెరిగింది. భద్రాచలం కొత్తగా మండలం కావడంతో మండలంలో 14, బూర్గంపహాడ్​లో 6ఎంపీటీసీలు పెరిగాయి. జిల్లాలో గతంలో 220 ఎంపీటీసీ స్థానాలుండేవి. ఇటీవల అశ్వారావుపేటతో పాటు మరో రెండు గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. దీంతో అశ్వారావుపేట మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాలు ఎగిరిపోయాయి. 

మిగిలిన 214 స్థానాలతో పాటు కొత్తగా ఏర్పడిన 22 ఎంపీటీసీ స్థానాలతో ప్రస్తుతం మొత్తంగా 236 ఎంపీటీసీ స్థానాలయ్యాయి. భద్రాచలం మండలం కొత్తగా ఏర్పడడంతో అదనంగా జడ్పీటీసీ ఏర్పడింది. ఇప్పటి వరకు 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇప్పడు భద్రాచలంతో కలిపి 22 జడ్పీటీసీ స్థానాలయ్యాయి. ఈ క్రమంలో ఎన్నికల పనుల్లో ఆఫీసర్లు బిజీబిజీగా మారారు. అటు సర్పంచ్​ ఎన్నికలకు జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, ఇటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు జిల్లా ప్రజా పరిషత్​ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. 

జిల్లాలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో భద్రాచలం,  బూర్గంపహాడ్​లో ఎన్నికలు జరగలేదు. ఈసారి ఆ  మండలాల్లోనూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తగా మండలంగా ఏర్పడిన భద్రాచలంలో అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా మండలాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రత్యేకంగా ప్రకటించాం. -  బి. నాగలక్ష్మి, జడ్పీ సీఈవో, భద్రాద్రికొత్తగూడెం