భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: నిరాశ్రయులకు షెల్టర్ కల్పించేందుకు నిధులు మంజూరైనా..అధికారులు ల్యాండ్ చూపలేకపోయారు. దీంతో బిల్డింగ్‌ల నిర్మాణాలకు రిలీజైన రూ.90లక్షలు రెండేళ్లుగా బ్యాంక్ ఖాతాల్లోనే మూలుగుతున్నాయి.
మూడేళ్ల కిందనే సర్వే....
జిల్లా కేంద్రం కొత్తగూడెంతోపాటు ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల్లో ఉన్న ఇండ్లు లేని నిరుపేదలతోపాటు అక్కడకు నిత్యం వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం షెల్టర్ ఫర్ అర్బన్ హోంలెస్(ఎస్ యూహెచ్ )భవనాలు ఉపయోగపడేలా మార్గదర్శకాలు రూపొందించారు. కాని ఈ భవనాల నిర్మాణాలు ఇన్‌టైంలో కాకపోవడంతో ఇటు నిరాశ్రయులతోపాటు అటు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక, లాడ్జీల్లో డబ్బులు పెట్టలేక చాలా మంది బస్టాండ్, రైల్వే స్టేషన్లు, షాప్‌ల ముందే పడుకుంటున్నారు.
దీనికి తోడు యాచకులు, కూలీ పని చేసుకొనే గూడు లేని వారందరి కోసం ప్రభుత్వం మొదటి దశలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో ఎస్ యూహెచ్ లకు సంబంధించి మూడేండ్ల కింద మెప్మా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. కొత్తగూడెంలో 60 మంది మహిళలు, 63 మంది పురుషులతోపాటు 47మంది చిన్నారులు నిరాశ్రయులుగా ఉన్నట్టు గుర్తించారు. ఇల్లెందు మున్సిపాలిటీలోనూ దాదాపు 60మందికి పైగా నిరాశ్రయులను గుర్తించారు. ఇలాంటి వారి కోసం కొత్తగూడెం, ఇల్లెందు పట్టణాల్లో ఎస్ యూహెచ్ నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం దాదాపు రూ.90లక్షలను రిలీజ్ చేసింది.
గ్రీన్ సిగ్నల్ఇచ్చినా.. సాగని నిర్మాణాలు...
ఎస్ యూహెచ్ బిల్డింగుల్లో నిరాశ్రయులతోపాటు దూర ప్రాంతాల ప్రజలు ఉండేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తాయి. వారికి రూ.5లకే భోజనం, కాల కృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. మిగితా సదుపాయాలు కల్పించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిరాశ్రయులకు ఎస్ యూహెచ్ నిర్మాణాలు చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు కేంద్రం ఈ నిర్మాణాలకు గ్రీన్సిగ్నల్ఇవ్వడంతో పాటు నిధులను మంజూరు చేసింది. కాగా రెండేండ్లుగా ల్యాండ్చూడడంతోనే ఆఫీసర్లు పని అయిపోయిందని మిన్నకున్నారు. కొత్తగూడెంలో రెండు చోట్ల ల్యాండ్ చూసి చేతులు దులుపుకున్నారు.
ఎస్ యూహెచ్ లకు ఎక్కడా ల్యాండ్ లేకపోవడంతో షెల్టర్ నిర్మాణాలు జరగలేదు. దీంతో డివైడర్లు, రైల్వే అండర్ బ్రిడ్జి కింద, డ్రైనేజీలు, షాపులే నిరాశ్రయులకు షెల్టర్లుగా మారాయి. వానా కాలం వస్తే ఇక వారి బాధలు చెప్పలేనివి. ఈ మధ్య కాలంలో బస్టాండ్, రైల్వే స్టేషన్లలో నిరాశ్రయులను ఉండనీయడంలేదు. దీంతో డివైడర్లు, షాపుల ముందే నిద్రిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలపైనే ఉంటూ, తింటూ నిరాశ్రయులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎస్ యూహెచ్ నిర్మాణాలపై దృష్టి సారించాల్సి ఉంది.