
- 100 దేశాల నుంచి హజరుకానున్న 500 మంది ప్రముఖులు
- చీఫ్ గెస్ట్ లుగా జైశంకర్, రాహుల్, ఖర్గే
- లోగో, థీమ్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని ఈనెల 25, 26న హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సమ్మిట్ కు 100 దేశాల నుంచి 500 మంది ప్రముఖులు హాజరవుతారని ఆయన చెప్పారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో భారత్ సమ్మిట్ లోగో, థీమ్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భట్టి ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సమ్మిట్ లోగో, థీమ్ ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు.
సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైంకర్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. సమ్మిట్ కు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నందుకు జైశంకర్ కు భట్టి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచేందుకు ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేలా ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్ పర్సన్ శ్యామ్ పిట్రోడా, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.
ప్రధాని ఎందుకలా మాట్లాడారో తెలియదు: భట్టి
తెలంగాణలో ఎక్కడా అటవీ భూములను తమ ప్రభుత్వం నరకలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారత్ సమ్మిట్‌పై సమావేశం అనంతరం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కారుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లను జర్నలిస్టులు ప్రస్తావించగా భట్టి స్పందించారు. ప్రధాని ఎందుకు అలా మాట్లాడారో తెలియదని, అడవులను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఆర్థిక అరాచక శక్తులుగా మారాయని, అందుకే హెచ్ సీయూను పొలిటికల్ ఇష్యూగా మార్చాయని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే ఆలోచనతో కాంగ్రెస్ పనిచేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లు అమలైతే బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో మేలు జరుగుతుందని, కానీ బీజేపీకి ఇది ఇష్టం లేదని, అందుకే బీసీ బిల్లులను అడ్డుకునేందుకు కుట్రచేస్తున్నదని ఆరోపించారు.