9 రెవెన్యూ గ్రామాలు.. 3,976 దరఖాస్తులు

9 రెవెన్యూ గ్రామాలు.. 3,976 దరఖాస్తులు
  • వెంకటాపూర్‌‌లో ముగిసిన భూభారతి రెవెన్యూ సదస్సులు
  • కొత్త పాస్‌‌బుక్కుల కోసం వచ్చిన అప్లికేషన్స్‌‌ ఎక్కువ
  • సాదా భైనామా పత్రాల ద్వారా పాస్‌‌బుక్కులు ఇవ్వాలని కోరిన రైతులు
  • శనివారం నుంచే ఫీల్డ్‌‌ వెరిఫికేషన్‌‌

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెంకటాపూర్‌‌(రామప్ప), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలుకు పైలట్‌‌ మండలంగా ఎంపికైన ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ మండలంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. ఈ నెల 17న నర్సాపూర్‌‌లో ప్రారంభమవగా 23న లక్ష్మీదేవీపేటతో కంప్లీట్‌‌ అయ్యాయి. మరో మూడు రోజులపాటు పొడిగించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి శనివారం ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ ప్రభుత్వానికి పంపించారు. మొత్తం 9 రెవెన్యూ గ్రామాల పరిధిలో వివిధ కేటగిరీల కింద 3,976 అప్లికేషన్లు స్వీకరించినట్లుగా రెవెన్యూ ఆఫీసర్లు ప్రకటించారు. వెంకటాపూర్‌‌లో అత్యధికంగా 1,295 అప్లికేషన్లు వస్తే రామంతపల్లిలో అత్యల్పంగా 25 దరఖాస్తులు స్వీకరించారు. శనివారం నుంచే ఫీల్డ్‌‌ వెరిఫికేషన్‌‌ స్టార్ట్‌‌ చేశామని ఇందుకోసం ప్రత్యేకంగా 9 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌‌ దివాకర 
తెలిపారు.  

కొత్త పాస్‌‌బుక్స్‌‌ కోసమే ఎక్కువ దరఖాస్తులు..

భూభారతిలో భాగంగా వెంకటాపూర్‌‌ మండలంలో నిర్వహించిన సదస్సుల్లో కొత్త పట్టాదారు పాస్‌‌బుక్స్‌‌ కోసం 1,647 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వెంకటాపూర్‌‌ నుంచి అత్యధికంగా 562 మంది అప్లయ్‌‌ చేశారు. ఆ తర్వాత సాదా బైనామా కింద 1,240 దరఖాస్తులు వచ్చాయి.

 అసైన్డ్‌‌ భూమి సమస్యలు తీర్చాలని 327, విస్తీర్ణం తక్కువ నమోదు చేశారని 243, పాస్ బుక్కులో వివరాలు తప్పుగా ఎంటర్‌‌ చేశారని 188 మంది రైతులు అప్లికేషన్లు ఇచ్చారు. సర్వే సబ్‌‌ డివిజన్‌‌ చేయాలని 21, నిషేదిత జాబితాలో ఉన్న భూములు తొలగించాలని 9, 38 ఈ సర్టిఫికేట్‌‌ జారీ చేయాలని 19 మంది, భూసేకరణ సమస్య ఉన్నదని ముగ్గురు, ఓఆర్‌‌సీ రాలేదని ఒకరు, ఇతర సమస్యలపై 278 మంది రైతులు దరఖాస్తులు ఇచ్చినట్లుగా మండల తహసీల్దార్‌‌ గిరిబాబు పేర్కొన్నారు. 

ఫీల్డ్‌‌ వెరిఫికేషన్‌‌ స్టార్ట్‌‌..

మండలంలో వచ్చిన అప్లికేషన్లపై శనివారం నుంచే ఫీల్డ్‌‌ వెరిఫికేషన్‌‌ స్టార్ట్‌‌ చేశారు. కలెక్టర్‌‌ దివాకర 9 రెవెన్యూ గ్రామాలకు 9 టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి టీమ్‌‌లో ఉన్న రెవెన్యూ గిర్ధవార్లు తమకు కేటాయించిన గ్రామాల్లో  తిరిగారు. ‌సోమవారం నుంచి ఒక్కో అప్లికేషన్‌‌ ప్రకారం ఫీల్డ్‌‌ వెరిఫికేషన్‌‌ చేసి రిపోర్ట్‌‌ను కలెక్టర్‌‌కు అందిస్తామని ఆఫీసర్లు తెలిపారు. 

ప్రతి అప్లికేషన్‌‌ను ఫీల్డ్‌‌ లెవల్‌‌లో పరిశీలిస్తాం..

భూ భారతిలో సమస్య పరిష్కరించాలని వచ్చిన ప్రతి దరఖాస్తును ఫీల్డ్‌‌ లెవల్‌‌ పరిశీలిస్తాం. ఇందుకోసం వెంకటాపూర్‌‌ మండలంలోని 9 రెవెన్యూ గ్రామాల్లో 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు  చేశాం. బృందం సభ్యులు ఫీల్డ్‌‌లో తిరిగి తహసీల్దార్‌‌కు రిపోర్ట్‌‌ అందజేస్తారు. తహసీల్దార్‌‌, ఆర్డీవో, కలెక్టర్‌‌ లెవల్‌‌లో జరిగే పనులను కేటగిరీల వారీగా గడువులోగా పరిష్కరిస్తాం.  – దివాకర, ములుగు కలెక్టర్‌‌

సదస్సుల్లో గ్రామాల వారీగా వచ్చిన అప్లికేషన్లు 

 

గ్రామం                     అప్లికేషన్లు 
నర్సాపూర్                  740
వెంకటాపూర్               1295
రామంతపూర్             429
నల్లగుంట                   345
తిమ్మాపూర్                 48
అడవి రంగాపూర్       50
రామంతపల్లి              25
 లక్ష్మీదేవి పేట          977
మొత్తం                      3,976