- ఉదయం బీదర్‌లో ఏటీఎం క్యాష్ రీఫిల్ వ్యాన్ సిబ్బందిపై దొంగల ముఠా కాల్పులు
- ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి.. బీదర్ నుంచి హైదరాబాద్‌కు దొంగలు
- అఫ్జల్‌గంజ్ నుంచి ట్రావెల్స్‌లో చత్తీస్‌గఢ్ వెళ్లేందుకు యత్నం
- డబ్బుల బ్యాగ్ చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ హెల్పర్‌పై కాల్పులు
- హెల్పర్ జహంగీర్ కడుపు, కాలిలో దిగిన 2 బుల్లెట్స్
- నిందితుల కోసం జల్లెడ పడుతున్న నగర పోలీసులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బీదర్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ చేసిన దొంగల ముఠా హైదరాబాద్‌కు వచ్చింది. గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్‌లో ని రోషన్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దుండగుల బ్యాగ్‌ను తనిఖీ చేసిన హెల్పర్..డబ్బుల గురించి ప్రశ్నించాడు. యజమానికి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయగా.. అతడిపై దొంగలు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు.
ఈ కాల్పుల్లో జహంగీర్(34) అనే హెల్పర్ తీవ్రంగా గాయపడ్డాడు. కడుపు, కాలిలోకి రెండు బుల్లెట్స్ దూసుకుపోవడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. కాల్పుల ఘటనతో నగర పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దొంగల ముఠా కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నగర శివారు ప్రాంతాలు సహా జిల్లాల బోర్డర్స్‌లో నాకాబందీ నిర్వహిస్తున్నారు.
బీదర్‌లో రూ.93 లక్షల దోపిడీ
కర్నాటక స్టేట్ బీదర్‌లో గురువారం పట్టపగలే అంతర్రాష్ట్ర దొంగల ముఠా దోపిడీ చేసింది. స్థానిక శివాజీ చౌక్‌లో గల ఏటీఎంలో క్యాష్ రీఫిల్ చేసేందుకు వచ్చిన కస్టోడియన్ వ్యాన్ సిబ్బందిపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. రూ.93 లక్షలు గల బ్యాగ్‌తో పారిపోయారు. ఈ ఘటనలో వ్యాన్ సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రగాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వీరిద్దరినీ సీఎంఎస్ ఏజెన్సీ ఉద్యోగులు గిరి వెంకటేశ్, శివ కాశీనాథ్గా పోలీసులు తేల్చారు. ఈ దోపిడీకి పాల్పడిన ఇద్దరు సభ్యుల చత్తీస్‌గఢ్ ముఠా బీదర్ పోలీసులకు చిక్కకుండా పారిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఇద్దరు దుండగులు సాయంత్రం 4.30 గంటల సమయంలో అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్‌కు చేరుకున్నారు.
ట్రావెల్స్ హెల్పర్‌పై రెండు రౌండ్ల కాల్పులు
అఫ్జల్‌గంజ్ నుంచి చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు వెళ్లేందుకు దొంగల ముఠా సభ్యులు అమిత్‌కుమార్ పేరుతో రెండు టికెట్స్ బుక్ చేసుకున్నారు. రాత్రి 7.30 గంటలకు రోషన్ ట్రావెల్స్ బస్సు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ట్రావెల్స్ హెల్పర్ జహంగీర్ ప్రయాణికుల లగేజ్ బ్యాగులను తనఖీ చేశాడు. అదే సమయంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్‌ను గుర్తించాడు. అనుమానం వచ్చి మేనేజర్‌కు సమాచారం అందించాడు. అదే బస్సులో కర్నాటకకు చెందిన పోలీసులు ఉండడంతో దొంగల ముఠా అలర్ట్ అయ్యింది. ముఠాలో అమిత్ అనే దుండగుడు తన వద్ద ఉన్న రివాల్వర్‌ను బయటకు తీశాడు. ఒక్కసారిగా జహంగీర్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జహంగీర్ కడుపు, కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ తర్వాత గన్స్ చూపిస్తూ ఇద్దరు దొంగలు పారిపోయారు.
తుపాకులతో పోలీసుల నాకా బందీ
అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల ఘటనతో గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. తప్పించుకుపోయిన నిందితుల కోసం మూడు కమిషనరేట్ల పరిధిలోని లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు.
దోపిడీ దొంగల వద్ద గన్స్ ఉండడంతో పోలీసులు కూడా గన్స్‌తో నగరాన్ని జల్లెడ పడుతున్నారు. దుండగులు దాడులకు దిగితే ప్రతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యక్షంగా మూడు కమిషనరేట్ల సీపీల పర్యవేక్షణలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు, రైళ్లనూ వదల్లేదు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.