2 నెలల గరిష్టానికి బ్యాంకుల డిపాజిట్ల రేటు

 2 నెలల గరిష్టానికి బ్యాంకుల డిపాజిట్ల రేటు
  • నిలకడగా క్రెడిట్​వృద్ధిరేటు వెల్లడించిన ఆర్​బీఐ

న్యూఢిల్లీ: బ్యాంకులు తమ డిపాజిట్లను వేగంగా పెంచుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) డేటా ప్రకారం, సెప్టెంబర్ 20, 2024 నాటికి బ్యాంకుల డిపాజిట్ వృద్ధి 11.34 శాతంగా ఉంది. ఇది సెప్టెంబర్ 6 నాటికి 10.96 శాతంగా ఉంది. జూన్ 28, 2024 నాటికి బ్యాంకుల డిపాజిట్ వృద్ధి రేటు 12.55 శాతంగా ఉంది. దీని తర్వాత, జూలై 12  సెప్టెంబర్ 6 మధ్య వృద్ధి రేటు 10.64 శాతం నుంచి 11.09 శాతానికి పెరిగింది.

ఈ కాలంలో క్రెడిట్ వృద్ధి దాదాపు 13 శాతం వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​లో వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఉదాహరణకు, బ్యాంక్ ఆఫ్ బరోడా తన గ్లోబల్ డిపాజిట్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో 9.11 శాతం పెరుగుదలను నివేదించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో 8.83 శాతం వృద్ధి సాధించింది. దేశీయ డిపాజిట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో 7.14 శాతం పెరిగాయి. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో 5.25 శాతంగా ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై-–సెప్టెంబర్ క్వార్టర్​లో మొత్తం డిపాజిట్లలో 9.17 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఏప్రిల్–జూన్ క్వార్టర్​లో 8.52 శాతం పెరుగుదల ఉంది. ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ లోన్లు  అడ్వాన్సులు సెప్టెంబర్ 30, 2023 నాటికి రూ. 1,83,236 కోట్ల నుంచి ఒక సంవత్సరం తర్వాత రూ. 2,22,188 కోట్లకు పెరిగాయి.

వార్షిక వృద్ధి 21.3 శాతం ఉంది. కస్టమర్ డిపాజిట్లు రూ. 1,64,726 కోట్ల నుంచి రూ.2,17,738 కోట్లకు పెరిగాయి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లోన్​గ్రోత్​ఏడు శాతం, డిపాజిట్ వృద్ధి 15 శాతం తగ్గింది.  గత కొన్ని నెలలుగా క్రెడిట్ వృద్ధి బాగానే ఉన్నా, డిపాజిట్ వృద్ధి నెమ్మదిగా ఉంది. దీనిపై ఆర్​బీఐ ఆందోళన ప్రకటించింది. డిపాజిట్ సమీకరణపై మరింత దృష్టి పెట్టాలని బ్యాంకులను కోరింది.