
చెన్నై: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రజలను స్టాలిన్ సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నదని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై అన్నారు. రూపాయి సింబల్ మార్చడం, అవినీతిని వ్యతిరేకిస్తూ శుక్రవారం నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో అన్నామలై మాట్లాడారు. మొత్తం బడ్జెట్ సమావేశమంతా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.
‘‘రూపాయి సింబల్ ను మార్చి సీఎం స్టాలిన్ మూర్ఖపు పని చేశారు. ఆయన ఓ స్టుపిడ్. స్టాలిన్ సర్కారు కృత్రిమ వివాదాన్ని సృష్టించి సభను తప్పుదారి పట్టిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే రూపాయి సింబల్ ని మార్చి రచ్చ చేస్తున్నారు. వాస్తవానికి దేవనాగరి లిపి ఆధారంగా రూపాయి సింబల్ ని రూపొందించారు. హిందీ భాష లిపి కూడా దేవనాగరే. అంతేకాకుండా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కొడుకే ఆ సింబల్ ని డిజైన్ చేశారు. మరి అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదు?” అని అన్నామలై ప్రశ్నించారు.