మహబూబ్​నగర్​ లో రౌండ్​.. రౌండ్​కు ఉత్కంఠ

మహబూబ్​నగర్​ లో రౌండ్​.. రౌండ్​కు ఉత్కంఠ
  • 4,500 మెజార్టీతో గెలుపొందిన బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణ
  • చివరి మూడు రౌండ్లలో లీడ్​ వచ్చినా వంశీకి తప్పని నిరాశ

మహబూబ్​నగర్, వెలుగు: మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణ, కాంగ్రెస్​ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​ రెడ్డి మధ్య రౌండ్​ రౌండ్​కు లీడ్​ తగ్గుతూ, పెరుగుతూ రావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీకి 5,06,747 ఓట్లు రాగా, కాంగ్రెస్​కు 5,03,111 ఓట్లు వచ్చాయి. దీంతో డీకే అరుణ 3,636 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. సాయంత్రం పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను లెక్కించగా, డీకే అరుణకు నాలుగు వేలు, వంశీకి 3,136 ఓట్లు వచ్చాయి. ఓవరాల్​గా ఈవీఎం, పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు కలుపుకొని డీకే అరుణకు 5,10,747 ఓట్లు, వంశీకి 5,06,247 ఓట్లు వచ్చాయి. దీంతో అరుణ 4,500 స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.

11 రౌండ్లు బీజేపీకి.. పది రౌండ్లు కాంగ్రెస్​కు లీడ్​

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓట్లను లెక్కించారు. పార్లమెంట్​లోని 7  నియోజకవర్గాలుండగా, ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున మొత్తం 98 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 21 రౌండ్లలో ఓట్లు లెక్కించగా, మొదటి రౌండ్​ నుంచే బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల మధ్య టఫ్​ ఫైట్​ నడిచింది. 11 రౌండ్లలో బీజేపీకి లీడ్ రాగా, పది రౌండ్లలో కాంగ్రెస్​ పైచేయి సాధించింది. మొదటి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించి 11,272 ఓట్ల లీడ్​ సాధించగా, ఐదో రౌండ్​లో కాంగ్రెస్​ 375 ఓట్ల స్వల్ప లీడ్​ను సాధించింది. ఆరు, ఏడు, ఎనిమిదో రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించి 18,388 ఓట్ల లీడ్​కు చేరింది. 

తొమ్మిదో రౌండ్​లో కాంగ్రెస్​ పుంజుకొని ఆ రౌండ్​లో 5,453 ఓట్ల లీడ్​ను సాధించింది. పదో రౌండ్​లో బీజేపీ 2,636 ఓట్లను సాధించి 15,571 ఓట్ల లీడ్​కు చేరుకుంది. 11 రౌండ్​లో కాంగ్రెస్​కు 504 ఓట్ల స్వల్ప ఆధిక్యం రాగా.. 12వ రౌండ్​లో వంశీకి 6,966 లీడ్​ వచ్చింది. 13వ రౌండ్​లో తిరిగి బీజేపీ 5,673, 14వ రౌండ్​లో  1,488 ఓట్లు రావడంతో అప్పటి వరకు డీకే అరుణ 22,732 ఓట్ల లీడ్​కు చేరుకుంది. 

15, 16, 17వ రౌండ్లలో కాంగ్రెస్ 1,573, 4,896, 385 ఓట్ల ఆధిక్యం రాగా, 18వ రౌండ్​లో బీజేపీకి 572 ఓట్ల స్వల్ప ఆధిక్యత వచ్చింది. 19, 20, 21వ రౌండ్లలో కాంగ్రెస్​కు 688, 3,351, 1,305 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అప్పటికే డీకే అరుణ 3,636 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఉన్నారు. ఇదిలాఉంటే 8,708 పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు ఉన్నాయి. ఇందులో 847 ఓట్లు ఇన్​వాలీడ్​ కాగా, 106 ఓట్లను రిజెక్ట్​ చేశారు. నోటాకు 44 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 4 వేలు, కాంగ్రెస్​కు 3,136, బీఆర్ఎస్​కు 496 ఓట్లు వచ్చాయి.