కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు
  • సెకండ్ ప్రయార్టీ ఓట్లతో బీజేపీ అభ్యర్థికి దక్కిన విజయం
  • కోటా ఓట్లు రాకపోయినా.. మెజార్టీ ఉండడంతో విజేతగా ప్రకటన 
  • రెండో స్థానంలో కాంగ్రెస్​ అభ్యర్థి నరేందర్​రెడ్డి.. మూడో స్థానంలో బీఎస్పీ క్యాండిడేట్ హరికృష్ణ
  • మూడో ప్రయార్టీ ఓట్ల లెక్కింపు కోసం నరేందర్​రెడ్డి పట్టు
  • ఈసీ ఆదేశాలతో అంజిరెడ్డిని విన్నర్​గా ప్రకటించిన అధికారులు​
  • సుదీర్ఘంగా 60 గంటలపాటు కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌- గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్​ అంజిరెడ్డి గెలుపొందారు. దాదాపు 3 రోజులపాటు ఉత్కంఠగా సాగిన ముక్కోణపు పోరులో  ఎలిమినేషన్‌‌ రౌండ్స్‌‌ అనంతరం అంజిరెడ్డి విజేతగా నిలిచారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్​లో కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, మరికొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధిక్యతను ప్రదర్శించినప్పటికీ.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్​తో చివరికి అంజిరెడ్డినే విజయం వరించింది.

 కరీంనగర్‌‌–--నిజామాబాద్‌‌–--మెదక్‌‌–--ఆదిలాబాద్‌‌ జిల్లాల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల 3న ప్రారంభం కాగా.. టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య ఫస్ట్ ప్రయార్టీ ఓట్లతోనే గెలుపొందారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్‌‌‌‌ జరగగా.. పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 2,52,029 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటుకాగా,  28,686 ఓట్లు ఇన్ వ్యాలిడ్​ అయ్యాయి. దీంతో 1,11,672 గెలుపు కోటా ఓట్లుగా నిర్ధారించారు. 

ఆదినుంచీ ఆధిక్యంలో అంజిరెడ్డి

ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల కౌంటింగ్ మొదలయ్యాక మొదటి 5 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యత ప్రదర్శించారు. తర్వాత 6, 7, 8, 9  రౌండ్లలో కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి నరేందర్​రెడ్డి స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. అనంతరం 10, 11 రౌండ్లలో బీజేపీ క్యాండిడేట్​ తిరిగి పుంజుకుని తన మెజార్టీని నిలబెట్టుకున్నారు. బుధవారం ఉదయం 8.30 గంటలకల్లా.. మొత్తం ఫస్ట్ ప్రయార్టీ ఓట్లకు సంబంధించిన 11 రౌండ్లు పూర్తయ్యాయి. ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ క్యాండిడేట్​ అంజిరెడ్డికి 75,675 ఓట్లు, కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి నరేందర్​రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి నరేందర్​రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కేవలం 5,110 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.

 అయితే, ఏ అభ్యర్థికి కోటా ఓట్లు అయిన 1,11,672  ఓట్లు రాకపోవడంతో సెకండ్ ప్రయార్టీ ఓట్లను లెక్కించడం, తక్కువ ఓట్లు వచ్చినవారిని వరుస క్రమంలో ఎలిమినేట్ చేయడం తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో 53 మందిని ఎలిమినేట్ చేశారు. అయినప్పటికీ ఎవరూ కోటా ఓట్ల లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్‌‌‌‌ చేసి, ఆయన బ్యాలెట్లలోని సెకండ్ ప్రయార్టీ ఓట్లను లెక్కించారు. ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ తర్వాత బీజేపీ అభ్యర్థికి అత్యధికంగా98,637ఓట్లు వచ్చాయి.  కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థికి93,531ఓట్లు వచ్చాయి.  

కంటతడి పెట్టిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 

ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్‌‌‌‌ తర్వాత ఎవరూ కోటా ఓట్లను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువ ఓట్లతో లీడ్ లో ఉన్న  బీజేపీ అభ్యర్థి చిన్నమైల్‌‌‌‌ అంజిరెడ్డిని అధికారులు విజేతగా ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు.  దీంతో కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి నరేందర్‌‌‌‌ రెడ్డి అభ్యంతరం చెప్తూ తమలో ఎవరికీ 1,11,672  ఓట్లు రానందున విజేతను ప్రకటించొద్దని, అవసరమైతే థర్డ్​ ప్రయారిటీ ఓట్లను లెక్కించాలని ఆర్వో పమేలా సత్పతిని కోరారు. దీంతో అధికారులు వివరణ కోసం ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించారు. 

చివరికి మిగిలిన ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని ఈసీ ఆదేశించడంతో.. బీజేపీ అభ్యర్థి చిన్నమైల్‌‌‌‌ అంజిరెడ్డిని బుధవారం రాత్రి విన్నర్​గా ప్రకటించారు. దీంతో కౌంటింగ్‌‌‌‌ హాల్‌‌‌‌ నుంచి  అల్ఫోర్స్ నరేందర్‌‌‌‌రెడ్డి బయటికి రాగా.. ఆయనతో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నరేందర్​రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టుకున్నారు. గురువారం ఉదయం ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ పెడతామని ఆయన అనుచరులు ప్రకటించాక.. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన వెళ్లిపోయారు. 

60 గంటలపాటు కౌంటింగ్ 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌‌‌‌ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈ నెల 3న సోమవారం ఉదయం 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మొదలుపెట్టగా.. మరుసటి రోజు మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్  ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా.. బుధవారం 8 గంటల వరకు కొనసాగింది. చెల్లుబాటైన 2,23,343 ఓట్లను 11 రౌండ్లలో లెక్కించారు. 

అభ్యర్థులెవరికీ ఫస్ట్ ప్రయార్టీ ఓట్లలో సగం రాకపోవడంతో బుధవారం ఉదయం 9 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఓట్లు తక్కువగా వచ్చిన అభ్యర్థుల బ్యాలెట్లలోని సెకండ్ ప్రయార్టీ ఓట్లను లెక్కిస్తూ.. అవి ఎవరికి పోలైతే ఆ అభ్యర్థులకు కలిపారు. దిగువన ఎలిమినేట్‌‌‌‌ అయిన అభ్యర్థుల నుంచి సబ్‌‌‌‌పార్సిల్స్‌‌‌‌లో వచ్చిన ఓట్లను కూడా అంజిరెడ్డికి, నరేందర్ రెడ్డికి, ప్రసన్న హరికృష్ణకు కలుపుతూ వచ్చారు. ఇలా సాయంత్రం 5 గంటల వరకు  తక్కువ ఓట్లు వచ్చిన  53 మందిని ఎలిమినేషన్ చేశారు. సాయంత్రం 5.30 గంటల తర్వాత బీఎస్పీ ప్రసన్న హరికృష్ణకు పడిన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల నుంచి సెకండ్ ప్రయార్టీ ఓట్లను కౌంట్ చేయడం ప్రారంభించారు. ఈ పక్రియ ముగిసేసరికి బుధవారం రాత్రి 8.30 గంటలైంది. మొత్తం టైం లెక్కిస్తే కౌంటింగ్ ముగియడానికి 60 గంటలు పట్టింది. 

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని సొంతం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామనేందుకు ఈ గెలుపు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ విజయం చిరస్మరణీయమని, తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. విజయాన్ని అందించిన తెలంగాణ మేధావులు, టీచర్లు, పట్టభద్రులు, శ్రమించిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఆదిలాబాద్- నిజామాబాద్ –కరీంనగర్ –మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, ఇదే సెగ్మెంట్ నుంచి టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య గెలవడం గర్వకారణం. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా మేధావులు మొదలుకుని అన్ని వర్గాల  ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారనేందుకు ఇదే నిదర్శనం. ఎవరెన్ని కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, తెలంగాణ ప్రజలు బీజేపీ వెంటే నిలబడ్డారు” అని అన్నారు.