
హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన అపోహలను తొలగించడానికి ఈ నెల 20 నుంచి మే 5 వరకూ బీజేపీ ఆధ్వర్యంలో జన జాగరణ అభియాన్ కార్యక్రమం చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ముందుగా 17న రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివ ప్రకాశ్, అర్వింద్ మేనన్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మనోహార్రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలోని వక్ఫ్ చట్టంలోని లొసుగులను తొలగిస్తూ, మెరుగైన చట్టం తీసుకొచ్చేందుకే సవరణలు చేసినట్టు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ మాత్రం దీనిని మతపరమైన అంశంగా మలిచి ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఇది ప్రజా ప్రయోజనాలను కాపాడే, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో సమర్థతను తీసుకువచ్చే చట్టమని చెప్పారు. కేంద్రం 2024 ఆగస్టులో జాయింట్ పార్లమెంటరీ కమిటీని 31మందితో ఏర్పాటు చేసిందని,ఈ కమిటీ 25 రాష్ట్రాల్లో పర్యటించి, 38 పెద్ద సమావేశాలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మొత్తం 92 లక్షల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారని, దీనిపై లోక్ సభలో 13 గంటలు, రాజ్యసభలో 8 గంటలు చర్చ జరిగిందని వివరించారు.