హెచ్​సీయూ భూముల వ్యవహారంలో కేటీఆర్ హస్తం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హెచ్​సీయూ భూముల వ్యవహారంలో కేటీఆర్ హస్తం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హెచ్ సీయూ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్  ఎమ్మెల్యే కేటీఆర్  హస్తం ఉన్నట్లు తమకు అనుమానంగా ఉందని   బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ లో గొప్పలు చెబుతున్నారని, గ్యారంటీలపై చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. హైదరాబాద్​లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్  ఎంపీ రాహుల్ గాంధీకి భారత్  కన్నా ఇతర దేశాల మూలాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఆయనకు  విదేశాలపై ప్రేమ ఎక్కువ అని విమర్శించారు. 

రాహుల్ ను రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని, హామీలు అమలు చేయనందుకు ప్రజలు ఆయనను తెలంగాణలో అడుగు పెట్టనివ్వరని అన్నారు. తెలంగాణకు వచ్చేందుకు రాహుల్ కు ముఖం చెల్లడం లేదని ఎద్దేవా చేశారు. హెచ్ సీయూలో మీటింగ్  పెట్టే దమ్ము రాహుల్ కు ఉందా అని సవాలు చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి మతిస్థిమితం లేనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. తెలంగాణను రాహుల్  పాదాల వద్ద సీఎం తాకట్టు పెట్టారని విమర్శించారు. రాజ్యాంగేతర శక్తిలా కాంగ్రెస్  రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి  మీనాక్షి నటరాజన్  సెక్రటేరియేట్ లో అడుగుపెట్టారని, సీఎం లేనప్పుడు అజ్ఞాత వ్యక్తి సెక్రటేరియట్ లో రివ్యూ చేయడం చరిత్రలో లేదన్నారు.