బషీర్‌బాగ్, వెలుగు: హిమాయత్‌నగర్‌లో రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ ఆ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మిగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ నాయకులతో కలిసి హిమాయత్నగర్మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ టైంలో భారీగా ట్రాఫిక్‌జామ్ కావడంతో నారాయణగూడ పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ.. హిమాయత్‌నగర్‌లో పాడైన రోడ్లను పట్టించుకోని బల్దియా అధికారులు.. మంచిగున్న చోటే మళ్లీ కొత్తగా నిర్మిస్తున్నారని ఆరోపించారు.
మినర్వా హోటల్ నుంచి తెలుగు అకాడమీకి వెళ్లే రూట్లో రోడ్డు బాగానే ఉన్నా కాంట్రాక్టర్జేబులు నింపేందుకు కొత్తగా రోడ్డు పనులు చేపట్టారన్నారు. రెండు నెలల కిందట పనులు మొదలుపెట్టిన సదరు కాంట్రాక్టర్ రోడ్డును తవ్వించే టైమ్‌లో డ్రైనేజీ పైప్‌లైన్ పగిలిపోయిందన్నారు. మంచినీటి పైపులైన్లలో మురుగు కలుస్తోందని స్థానికులు వాటర్ వర్క్స్అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారుల కో ఆర్డినేషన్ లోపం కారణంగా డ్రైనేజీ పైప్లైన్లకు రిపేర్లు చేయడం లేదని మండిపడ్డారు. చాలాచోట్ల ఇండ్లలోకి మురుగు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్విన రోడ్డును బాగుచేసి పనులు పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.