- అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ
- అధినాయకత్వాన్ని కలిసి పలువురు ప్రయత్నాలు
- కొనసాగుతున్న మండలాల కమిటీల ఎంపిక
నల్గొండ, యాదాద్రి, వెలుగు: నల్లొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కమలం పార్టీకి కొత్త సారథులు ఎవరో ఒకటి రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. అధ్యక్ష పదవి కోసం అప్లయ్ చేసుకున్న వారిలో ఎవరు సమర్థులో బీజేపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. ఈ మేరకు సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న అంశంపై అంతర్గతంగా అభిప్రాయ సేకరణ కూడా చేస్తోంది.
పదవీ కాలం మూడేండ్లు..
పార్టీ నియమావళి ప్రకారం బీజేపీలో అధ్యక్షుడు మూడేండ్లపాటు పదవీలో కొనసాగుతారు. అలా వరుసగా రెండు టర్మ్‌లు కొనసాగే అవకాశం ఉంది. కానీ మూడోసారి మాత్రం అవకాశం ఉండదు. 2019–-20లో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారి పదవీకాలం 2023లో ముగిసింది. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో వారినే కొనసాగించారు. ఎన్నికల తర్వాతే కొత్త వారిని ఎంపిక చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కొత్త వారికి పార్టీ బాధ్యతలు అప్పగించడానికి సంస్థాగతంగా ఎన్నికల నిర్వహణ ప్రారంభించి, ఇన్చార్జీలను కూడా నియమించారు.
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మండలాలకు అధ్యక్షుల ఎంపిక కసరత్తు వేగంగా సాగుతోంది. కొన్ని మండలాల అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగా, మరికొన్ని చోట్ల నియామక ప్రక్రియ సాగుతోంది. అయితే ఈసారి యువ నాయకత్వానికే పగ్గాలు అప్పచెబుతుందని క్యాడర్ ఆశాభావంతో ఉంది. కొత్త కమిటీలతో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు.
నల్గొండలో సీనియర్ల వైపే మొగ్గు..
నల్గొండ అధ్యక్ష పదవి కోసం పార్టీలోని సీనియర్ నేతలంతా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం సామాజిక సమీకరణంలో భాగంగా ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న అంశంపై సీనియర్ నేతలతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాగం వర్షిత్ రెడ్డి మరోసారి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. జిల్లాలోని పలువురు సీనియర్లు పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని పెద్దలతో సంప్రదింపులు చేపడుతున్నట్లు సమాచారం.
ALSO READ | పతంగుల పంచాదిలో ఏడుగురు అరెస్ట్
బీజేపీ జిల్లా అధ్యక్షుడి రేసులో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బండారు ప్రసాద్, మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, బీసీ నాయకుల నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, ఎస్టీ నుంచి దేవరకొండ ఇన్చార్జి లాలూనాయక్, ఎస్సీ నుంచి పాక సాంబయ్య అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
సూర్యాపేటలో జూనియర్ వర్సెస్ సీనియర్లు..
సూర్యాపేట జిల్లాలో జూనియర్ వర్సెస్ సీనియర్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, కడియం రామచంద్రయ్య, చల్లా శ్రీలతరెడ్డి, చలమల నరసింహ, డాక్టర్ మురళీధర్ రెడ్డి, కాపా రవి, పోలిశెట్టి కృష్ణయ్య అధ్యక్ష పదవి ఆశిస్తుండగా మరోవైపు బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణ్ రావు సైతం జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు
చేస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో..
అధిష్టానం సూచన మేకు యాదాద్రి జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు అప్లికేషన్లు చేసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు పాశం భాస్కర్ సహా భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్మాయ దశరథ, పడమటి జగన్మోహన్రెడ్డి, పడాల శ్రీనివాస్, ఏసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చందామహేందర్‌గుప్తా, కడకంచి రమేశ్, ఉట్కూరి అశోక్అప్లికేషన్లు చేసుకున్నారు. తమ అప్లికేషన్లను పరిశీలించాలని పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకరి కోసం పార్టీ స్టేట్జనరల్ సెక్రటరీ ఒకరు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా
సమాచారం.
పలువురి పేర్లతో జాబితా రెడీ..
యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 11 మండలాలకు కొత్త అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. మిగిలిన మండలాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ కోసం అప్లికేషన్ చేసుకున్న వారి గురించి అంతర్గతంగా సర్వే కూడా పూర్తయింది. అనంతరం నలుగురైదుగురి పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర పార్టీకి పంపడంతో అక్కడి నుంచి కేంద్ర కమిటీకి కూడా పంపించారు. ఈ వారంలో అధ్యక్షుడి ఎంపికను ప్రకటించే అవకాశం ఉంది.
తాను ఏడాది మాత్రమే పదవీలో కొనసాగినందున తనకు మరోసారి అవకాశమివ్వాలని ప్రస్తుత అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ నియమావళి ప్రకారం 60 ఏండ్లు నిండిన వ్యక్తికి అవకాశం ఇవ్వరు. పాశం భాస్కర్ 60 ఏండ్లు ఉండడంతో మళ్లీ అవకాశం ఇస్తారా..? కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా..? అన్న చర్చ నడుస్తోంది.