కేటీఆర్.. దమ్ముంటే ప్రూఫ్స్​ బయటపెట్టు : పాయల్ శంకర్

కేటీఆర్.. దమ్ముంటే ప్రూఫ్స్​ బయటపెట్టు : పాయల్ శంకర్
  • లేదంటే పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండు
  • హెచ్​సీయూ భూములపై తప్పుడు ఆరోపణలు మానుకో:  బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: హెచ్​సీయూ భూముల ఇష్యూ వెనుక బీజేపీ ఎంపీ హస్తం ఉందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్  మండిపడ్డారు. కేటీఆర్​కు దమ్ముంటే ప్రూఫ్స్​ బయట పెట్టాలని,  లేదంటే బీజేపీ వేసే పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్  బంధం బయటపడుతుందని భయపడి కేటీఆర్.. ఇలా లేనిపోనివి మాట్లాడి ఇష్యూ డైవర్ట్ చేస్తున్నడు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు చేపట్టి, వారిని జైల్లో వేస్తామని గతంలో రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పిండు. 

ప్రభుత్వంలోకి వచ్చి15 నెలలు దాటినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ ఇక్కడి కాంగ్రెస్ లీడర్లతో డీలింగ్స్ చేసుకుంది. ఇక్కడ సెట్ అవ్వకపోతే ఢిల్లీ పెద్దలతో డీలింగ్స్ చేస్తున్నది” అని ఆరోపించారు. ‘‘ధరణి పేరిట ఎంతోమంది భూములను బీఆర్​ఎస్​ లాక్కుందని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

అలాంటిది ప్రభుత్వంలోకి వచ్చాక బీఆర్ఎస్​పై చర్యలు ఎందుకు తీసుకోలే? ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేవలం కేసు పెట్టారు..  కానీ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. గతంలో బీఆర్ఎస్ భూములు అమ్మింది.. ఇప్పుడు కాంగ్రెస్ అమ్ముతున్నది.. అంతే తేడా! వీటిపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ” అని ఆయన తెలిపారు. ‘‘రేవంత్ రెడ్డి.. బీజేపీని తెలంగాణలో రానివ్వం అంటున్నడు. కానీ మేం ఆల్రెడీ 8 లోక్​సభ స్థానాల్లో గెలిచి సగం వరకు వచ్చేశాం . అలాంటిది మమ్మల్ని వారు ఆపగలరా?” అని ప్రశ్నించారు.