డీలిమిటేషన్‌‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు : ఎంపీ లక్ష్మణ్

డీలిమిటేషన్‌‌తో దక్షిణాదికి  అన్యాయం జరగదు :  ఎంపీ లక్ష్మణ్
  • బీఆర్‌‌ఎస్‌‌, డీఎంకే పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి:  ఎంపీ లక్ష్మణ్

న్యూ ఢిల్లీ, వెలుగు: డీలిమిటేషన్‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. డీలిమిటేషన్‌‌తో దక్షిణాదిలో సీట్లు- తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌‌‌ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని గురువారం ఒక వీడియో ప్రకటనలో మండిపడ్డారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ బీఆర్‌‌ఎస్‌‌, డీఎంకే పార్టీలు ప్రాంతీయ విద్వేషాలురెచ్చగొడుతున్నాయన్నారు. 

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్‌‌ స్థానాలకు ఎలాంటి తగ్గింపు ఉండదని చెప్పారని, అయినా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లేని ఎజెండాను సృష్టించి ప్రాంతీయ పార్టీలు రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గత 11 ఏండ్లకు పైగా అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తూ, సంక్షేమ పథకాలతో అవినీతి రహిత ప్రజా పాలన అందిస్తున్నదని చెప్పారు.