
- సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ ప్రశ్న
- ప్రజా సమస్యలు, సిద్ధాంతంపై చర్చకు సిద్ధమని వెల్లడి
- టైమ్, ప్లేస్ చెప్పాలని ఎంపీ సవాల్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారా అని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు ఉన్నా కేటీఆర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఈడీ ఏమైనా స్టే ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు, సిద్ధాంతంపై చర్చకు తాము సిద్దమని, టైమ్.. ప్లేస్ చెప్పాలని సీఎంకు ఎంపీ సవాల్ విసిరారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో రఘునందన్ మాట్లాడారు.
రాష్ట్రంలో పాలన పడకేసిందని, ముఖ్యమంత్రికి పాలన చేయడం చేతకాక ఒకరిపై పడి ఏడవడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంపైనా సీరియస్ నెస్ ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఎస్ఎల్ బీసీ ఘటన జరిగి వారం రోజులైన తర్వాత సీఎంకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని మండిపడ్డారు. బీసీల కోసమే కాంగ్రెస్ పనిచేస్తోందని చెప్పి బీసీల కోసం మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఇప్పటికే ఫాంహౌస్ కు పరిమితమయ్యారని, రేవంత్ రెడ్డి దేనికి పరిమితమవుతారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డిపై రేవంత్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రివర్గం విస్తరించడం కూడా సీఎంకు చేతకావడం లేదన్నారు. త్రిభాషా సిద్ధాంతం గురించి రేవంత్ కు ఏం తెలుసన్నారు. త్రిభాషా సిద్ధాంతాన్ని తెచ్చిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. సెకండ్ ల్యాంగ్వేజ్ గా తెలుగు, కన్నడ, మళయాలం పెట్టాలని స్టాలిన్ ను డిమాండ్ చేసే దమ్ము రేవంత్ కు ఉందా? అని ప్రశ్నించారు. స్టాలిన్ కు వంత పాడటం దుర్మార్గమన్నారు.