ఓబీసీని సీఎం సీట్లో కూర్చోపెట్టగలరా?

ఓబీసీని సీఎం సీట్లో కూర్చోపెట్టగలరా?
  • కాంగ్రెస్​కు బీజేపీ ఎంపీ రఘునందన్  సవాల్​
  • మైనార్టీలను ఓబీసీలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపనివ్వబోమని కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర కులగణనలో ఓబీసీలు 55 శాతం ఉన్నట్లు కాంగ్రెస్  ఎంపీ రాహుల్ గాంధీ చెబుతున్నారని, మరి ఓబీసీని సీఎం కుర్చీలో కూర్చోపెట్టగలరా? అని బీజేపీ ఎంపీ రఘునందన్  ప్రశ్నించారు. 12 మందితో కూడిన రాష్ట్ర కేబినెట్ లో ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 55 శాతం ఓబీసీలు ఉంటే... వారికి కాంగ్రెస్  చేసే న్యాయం అదేనా అని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల పేరు చెప్పుకునే కాంగ్రెస్ ... కనీసం ఒక్కరికి కూడా మంత్రిపదవి ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. 

ఖాళీగా ఉన్న ఆరు మంత్రిపదవులు బీసీలకే ఇవ్వాలని డిమాండ్  చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్ సభలో నిర్వహించిన చర్చలో రఘునందన్  మాట్లాడారు. తాజా బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు చేయలేదని కాంగ్రెస్  నేతలు విమర్శించడం సరికాదన్నారు. ‘‘హైదరాబాద్  రూపురేఖల్ని మార్చే ఆర్ఆర్ఆర్  ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు  కేంద్రం ఇచ్చింది. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసింది.

ఇతర రాష్ట్రాల్లో ఎయిర్ పోర్టులకు ఇది సమానం. మరో రూ.500 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేశాం. ఇక, తెలంగాణలో 55 శాతం ఓబీసీలు ఉన్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్  చెప్పారు. అయితే ఇందులో 46 శాతం ఓబీసీలు, 10 శాతం మైనార్టీ ఓబీసీలు ఉన్నారు. ఈ మైనార్టీలను బీసీల్లో ఎట్టి పరిస్థితుల్లో కలపనీయబోం. రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది” అని రఘునందన్  పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్ లో ఏడుగురు ఓసీలు, ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారని, అయితే... కనీసం ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేకపోవడం శోచనీయమన్నారు. అదే నరేంద్ర మోదీ కేబినెట్ లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు కూడా ఉన్నారని తెలిపారు.