భూములు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నరు : రఘునందన్ రావు

భూములు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నరు : రఘునందన్ రావు
  • గ్రేటర్ చుట్టూ ఉన్న ల్యాండ్​పై కన్నేశారు: రఘునందన్ రావు
  • సంగారెడ్డి జిల్లాలో 85 ఎకరాలు కాజేసే కుట్ర జరుగుతున్నదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపై కొంద రు మంత్రులు కన్నేశారని, సంగారెడ్డి జిల్లాలోని వెలిమల గ్రామంలో 85 ఎకరాలు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఉదయం వెలిమల శివారులో సాగుచేస్తున్న భూముల పరిశీలనకు వెళ్తున్నట్టు ఆయన చెప్పారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వెలిమలలో 434 సర్వే నంబర్​లో ప్రభుత్వ భూమి ఉంది. ఇదే సర్వేనంబర్ లో మరో 85 ఎకరాలు లెక్కలో లేకుండా ఉంది. 

అయితే, ఈ భూమికి సరిహద్దు సర్వే నంబర్లు ఆనుకుని ఉన్న వాటి ఆధారం చేసుకుని 632 నుంచి 644 వరకు 12 కొత్త సర్వే నంబర్లు సృష్టించారు. ఆ భూమిని అనర్హులకు, రియల్ ఎస్టేట్ మాఫియా, ప్రైవేట్ కంపెనీలకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. అందులో 40 ఎకరాలు.. స్థానికులైన తమకు ఇవ్వాలని వెలిమల తండా కొండకల్​కు చెందిన గిరిజనులు పోరాడుతుంటే.. వారిపై 5 కేసులు పెట్టారు’’అని రఘునందన్ రావు అన్నారు. 

రంగారెడ్డి జిల్లా కొండకల్, సంగారెడ్డి జిల్లా వెలిమల గ్రామాల సరిహద్దులో గల భూమిపై హక్కుల కోసం 40 మంది గిరిజనులు 1994లోనే ఏపీ హైకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. ‘‘ల్యాండ్ రెవెన్యూ సెక్షన్ 87 ప్రకారం క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు రెండేండ్లలో సరి చేయొచ్చు. ప్రభుత్వ భూమిని మార్చడం క్లరికల్ ఎర్రర్ కాదని స్పష్టంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. కలెక్టర్ తెలివితో రిపోర్ట్ ఇచ్చారు. అమాయక గిరిజనులపై కేసులు పెట్టి మరీ.. రూ.1,200 కోట్ల భూమి కబ్జా చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఆ భూములను అరబిందో, అపర్ణ సంస్థల పేర్లు పహాణిలో రాసే ప్రయత్నం చేస్తున్నారు’’అని  ఆరోపించారు.