సూరి: పశ్చిమ బెంగాల్లో ఎంపీలు, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తాపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ముప్పు జరగలేదు. బుధవారం బీర్భూమ్ జిల్లా లాభ్పూర్ ఏరియాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ టైమ్లో బోట్లో ప్రయాణిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ఎవరూ కూడా లైఫ్ జాకెట్ వేసుకోకపోవడం గమనార్హం. కుయే నది కట్ట తెగిపోవడంతో లాభ్పూర్ ఏరియాలో 15 గ్రామాలు నీటమునిగాయి. దీనిని పరిశీలించేందుకు వెళ్లిన టీఎంసీ ఎంపీలు అసిత్ మాల్, సమీరుల్ ఇస్లాం, ఎమ్మెల్యే అభిజిత్ సిన్హా, బీర్భూమ్ కలెక్టర్ బిధాన్ రే సహా 13 స్పీడ్ బోట్ ఎక్కారు.
ఇటీవలి వర్షాలకు కుయే నది ఉధృతంగా ప్రవాహిస్తున్నది. ఆయా గ్రామాల్లో వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. ప్రవాహం మధ్యలోకి వెళ్లాక బోటు ఒక్కసారిగా బోల్తా పడింది. అక్కడే ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) అందరిని రక్షించింది. తర్వాత అసిత్ మాల్ మాట్లాడుతూ ‘‘నాకు ఈత వచ్చు.. కానీ ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. దీంతో నేను ఈదలేకపోయాను. అదృష్టవశాత్తు ఒక చెట్టుకొమ్మ దొరికితే పట్టుకున్న. నేను ఎక్కువ దూరం కొట్టుకుపోలేదు” అని అన్నారు. బోటు ప్రమాదంపై జిల్లా యంత్రాంగం ఎంక్వైరీ చేపట్టింది.