- ప్రయాణికులకు నిలబడే జాగా కరువు
- బోధన్ పాత బస్టాండ్నిర్వహణ అధ్వాన్నం
- పట్టించుకొని పోలీసు, ఆర్టీసీ అధికారులు
బోధన్, వెలుగు: బోధన్ పాత బస్టాండ్అధ్వాన్నంగా మారింది. పండ్లబండ్లు, ఆటోలు బస్టాండ్‌లోనే నిలుపుతుండడంతో ప్రయాణికులు నిలబడేందుకు కూడా జాగా ఉండడం లేదు. ఇక్కడ నుంచి సాలూరా, బోధన్ మండలాల్లోని గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు రోజూ వేలాది మంది వెళ్తుంటారు. పండ్లవ్యాపారులు, ఆటోవాలలతో బస్టాండ్ నిండిపోవడంవల్ల ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డు మీద నిలబడుతున్నారు.
బస్టాండ్పక్కనే మున్సిపాలిటీ పండ్ల మార్కెట్ నిర్మించింది. టెండర్నిర్వహించి షాపులను వ్యాపారులకు కేటాయించింది. బస్టాండ్‌లో ఎవరూ పండ్లు అమ్మవద్దని, కాంప్లెక్స్ లోని షాపుల్లోనే అమ్మకాలు జరపాలని అధికారులు కచ్చితంగా చెప్పడంతో కొంతకాలం పాటు బండ్లు కనిపించలేదు. క్రమంగా కొందరు వ్యాపారులు బస్టాండ్‌లోని ఖాళీ జాగాల్లో తిష్ట వేసి పండ్లు అమ్మడం మొదలుపెట్టారు. దీంతో మళ్లీ బస్టాండ్ పండ్ల దుకాణాలు, ఆటోలతో నిండిపోతోంది. బస్సుల కోసం వచ్చిన పాసెంజర్లు ఎండకు ఎండి.. వానకు తడిసే పరిస్థితి వచ్చింది.
బస్టాండ్‌లోనే కొందరు పండ్ల వ్యాపారాలు చేస్తుండడంతో మున్సిపల్ కాంప్లెక్స్‌లోని షాపుల యజమానులు ఆరు నెలలుగా మున్సిపాలిటీకి రెంట్ కట్టలేమంటూ చేతులెత్తేశారు. బస్టాండ్‌లో బండ్లు పెట్టడం వల్ల తమ దగ్గర పండ్లు కొనేందుకు ఎవరూ రావడంలేదని, గిరాకీలేక కిరాయి కట్టలేక పోతున్నామని వారు చెప్తున్నారు. బస్టాండ్‌లో అమ్మకాలు అపితేనే తాము కిరాయి కడతామని తేల్చిచెప్తున్నారు.
పాత బస్టాండ్‌లో పండ్లు దుకాణాలు , అటోలు నిలపడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నా.. పోలీసు, మున్సిపల్, ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. గంటల తరబడి రోడ్లమీదే బస్సుల కోసం నిలబడడం వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఆర్టీసీ, పోలీసు, మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పండ్లదుకాణాలపై చర్యలు తీసుకుంటాం
పండ్ల వ్యాపారులు తమ షాపుల్లో కాకుండా బస్టాండ్‌లో అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎక్కడిపడితే అక్కడ పండ్లు అమ్మడంతో షటర్లు తీసుకున్న వారు ఆరునెలల నుంచి కిరాయి చెల్లించడంలేదు. పోలీసు, ఆర్టీసీ అధికారుల సమన్వయంతో త్వరలోనే పండ్ల దుకాణాలు, అటోలను బస్టాండ్ ఆవరణ నుంచి తొలగిస్తాం – మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ