
హైదరాబాద్ సిటీ/ మెహిదీపట్నం, వెలుగు: ఆషాఢమాస బోనాలు జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అదే రోజు గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించనున్నారు. జులై 13న సికింద్రాబాద్ మహంకాళి(లష్కర్), అదే నెల 20న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.
నెలరోజుల పాటు జరగనున్న బోనాల ఉత్సవాలు.. జులై 24 న ముగుస్తాయని దేవదాయ శాఖ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జూన్ 26న గోల్కొండ అమ్మవారికి మొదటి పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రెండో పూజ జూన్ 29న, మూడో పూజ జులై 3న , నాల్గవ పూజ అదే నెల 6న , 5వ పూజ 10వ తేదీన, 6వ పూజ13న, ఏడవ పూజ17న, ఎనిమిదో పూజ 20వ తేదీన జరగనున్నాయి. చివరగా జూలై 24న 9వ పూజ తరువాత బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.