
- పరీక్షలు పెట్టలేని దుస్థితిలో తెలంగాణ
- టీచర్లను బదిలీలు చేసుకోలేని పరిస్థితి
- ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలు
- రాజధాని కూడా లేని రాష్ట్రం ఏపీ
- మేం మాట్లాడాలంటే చాలా ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్
విజయవాడ : తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడడం సరికాదన్నారు. టీఎస్పీఎస్సీలో చూచిరాతలు, స్కాంలు వెలుగు చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. జులై 13వ తేదీ విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా బొత్స మాట్లాడారు. ‘కొంతమంది మాట్లాడితే తెలంగాణ పేరు ఎత్తుతున్నారు. తెలంగాణ పరిస్థితి ఏంటో రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ నే సక్రమంగా నిర్వహించలేని దుస్థితి తెలంగాణలో ఉంది. అక్కడ చూచిరాతలు, స్కాంలు జరుగుతున్నాయి. ఎంతో మంది అరెస్ట్ అవుతున్నారు. కనీసం వారి టీచర్లను బదిలీలు చేసుకోలేని పరిస్థితి నెలకొంది’ అని బొత్స తీవ్ర విమర్శలు చేశారు. ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో పోల్చడం సరికాదన్నారు. ఎవరి విధానం వారికి ఎవరి ఆలోచన వారికి ఉంటుందన్నారు. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
రాజధానిని లేదు కానీ ఏవేవో మాట్లాడుతున్నరు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఏపీ కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రమని మాట్లాడాలంటే తాము చాలా మాట్లాడగలుగుతామని తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బొత్స వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇటీవల ఏపీ నేతలు పదే పదే తెలంగాణ పై ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం, ఏపీలో ఎన్ని ఏర్పాటు చేశారో చర్చకు వస్తే చెబుతామని పేర్కొన్నారు.