మళ్లీ మొదలైన సింగరాయ జాతర లొల్లి

  • అధికారులే జాతరను జరిపించాలని తహసీల్దార్​కు వినతి

కోహెడ, వెలుగు: మండలంలోని కూరెల్ల, తంగళ్లపల్లి, బస్వాపూర్, గుండారెడ్డిపల్లి గుట్టల మధ్య జరిగే సింగరాయ జాతర సరిహద్దు వివాదం మళ్లీ మొదలైంది. ఈ నెల 29న జాతర ఉండడంతో ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే ఆధారంగా సింగరాయ ప్రాంతం తంగళ్లపల్లి పరిధిలోకి వస్తుందని చెప్పడంతో​కూరెల్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జాతరను అధికారుల ఆధ్వర్యంలో జరిపించాలని గురువారం తహసీల్దార్​ సురేఖకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కూరెల్ల గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ తాత ముత్తాతల నుంచి జాతరను తామే నిర్వహిస్తున్నామని, రికార్డుల్లో సైతం కూరెల్ల సింగరాయజాతర అని ఉంటుందన్నారు. మూడేళ్లుగా తంగళ్లపల్లి గ్రామస్తులు సరిహద్దు వివాదం తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఏడాది కింద తప్పుడు సర్వే చేయించారన్నారు. మళ్లీ సర్వే చేసే వరకు అధికారుల ఆధ్వర్యంలోనే జాతర నిర్వహించాలని డిమాండ్​ చేశారు.