బ్రిక్స్ డెవలప్​మెంట్ బ్యాంక్ అంటే ఏంటి.? ఎపుడు స్థాపించారు

బ్రిక్స్ డెవలప్​మెంట్ బ్యాంక్ అంటే ఏంటి.? ఎపుడు స్థాపించారు

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్(ఐబీఆర్ డీ)లు అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా ఉండటం, ప్రపంచ జనాభాలో సగం బ్రిక్స్ దేశాల్లో ఉన్నా ఐఎంఎఫ్ ఓటింగ్​లో మాత్రం 15 శాతం కంటే తక్కువ ఓటింగ్​ కలిగి ఉండటం వల్ల నూతన అభివృద్ధి బ్యాంక్ లేదా బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఏర్పాటు చేయాలని భావించారు. 2014లో ఒప్పందం జరగగా 2015లో రష్యా సమావేశం నుంచి ఉనికిలోకి వచ్చింది. ఈ సంస్థ ప్రధాన కేంద్రం చైనాలోని షాంఘైలో ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని అవస్థాపన, సుస్థిరాభివృద్ధి ప్రాజెక్టులకు రుణాలు, గ్యారంటీల ద్వారా మద్దతు ఇవ్వడం, సాంకేతిక సాయం అందించడం న్యూ డెవలప్​మెంట్ బ్యాంక్ ప్రధాన విధులు. రవాణా, పరిశుద్ధ ఇంధనం, నీటి పారుదల, నీటి నిర్వహణ, పారిశుద్ధ్యం, పట్టణ అభివృద్ధి, సాంఘిక అవస్థాపన రంగాలకు రుణాలు ఇస్తుంది. 

 బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా(బ్రిక్స్) ప్రారంభ సభ్య దేశాలు. అయితే, ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలకు న్యూ డెవలప్​మెంట్ బ్యాంకులో సభ్యత్వానికి అనుమతిస్తారు. బ్రిక్స్ దేశాల వాటా ఓటింగ్ లో 55 శాతం కంటే తక్కువ కావొద్దు. దీర్ఘకాల అభివృద్ధి కోసం సభ్యత్వాన్ని విస్తరించారు. అందుకే 2021 నాటికి నాలుగు దేశాలు(బంగ్లాదేశ్, యూఏఈ, ఉరుగ్వే, ఈజిప్ట్) కొత్త సభ్యదేశాలుగా చేరాయి. అధీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లు. కాగా, చందా మూలధనం 50 బిలియన్ డాలర్లు . ఐదు దేశాలు సమాన వాటా కలిగి ఉన్నాయి. వన్ మెంబర్ వన్ ఓట్ పాలసీని కలిగి ఉన్నది. వీటో పాలసీ లేదు. రుణాలు స్వల్ప కాలంలో అంటే ఆరు నెలల్లో ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నది. మధ్యప్రదేశ్​లో జిల్లా రోడ్లకు, రాజస్తాన్​లో తాగునీటి పునర్ నిర్మాణానికి చెందిన ప్రాజెక్టులకు ఎన్​డీబీ రుణాన్ని ఆమోదించింది. పునరావృత శక్తి వనరులు, గ్రీన్ ఎనర్జీకి కూడా రుణాలు ఇచ్చారు. కొవిడ్ –19 సమయంలో అత్యవసర పథక రుణాన్ని ఇండియా తీసుకున్నది. 

కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్​మెంట్(సీఆర్ఏ)

బ్రిక్స్ దేశాల్లో బీఓపీ సమస్యలు ఎదురైనప్పుడు స్వల్పకాల ద్రవ్యత్వ సర్దుబాటుకు 2015లో బ్రిక్స్ దేశాలు దీనిని ఏర్పాటు చేశాయి. ఇది 100 బిలియన్ డాలర్లతో ఏర్పడింది. ఇందులో చైనా 41 శాతం, బ్రెజిల్, ఇండియా, రష్యాలు 18 శాతం, దక్షిణాఫ్రికా 5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. సీఆర్ఏలో భారత్ 18.10 శాతం, చైనా 39.95 శాతం ఓటింగ్​ హక్కును కలిగి ఉన్నాయి.

ఏసియన్ డెవలప్​మెంట్ బ్యాంక్(ఏడీబీ)

31 సభ్య దేశాలతో 1966లో బహుళ అభివృద్ధి బ్యాంకుగా ఏర్పడింది. ఇండియా ప్రారంభ సభ్యదేశం. 2019 నాటికి 68 దేశాలకు పెరిగింది. ఇందులో 49 దేశాలు ఆసియా– పసిఫిక్ ప్రాంతం నుంచి బయట ప్రాంతాల నుంచి 19 దేశాలు  ఉన్నాయి. ఈ సంస్థ ప్రధాన కేంద్రం పిలిప్పైన్స్​లోని మాండలుయంగ్ లో ఉన్నది. ప్రపంచ బ్యాంక్ మాదిరిగా సభ్యదేశాల మూలధన చందాను అనుసరించి ఓటింగ్ విధానం ఉంటుంది. జపాన్, అమెరికా, చైనా, ఇండియాలు ఎక్కువ వాటా మూలధనాన్ని కలిగి ఉన్నాయి. ఆసియా, దూర పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధి సహకారానికి కృషి చేయడం, పేదరికాన్ని తగ్గించడం, ఆర్థిక స్థిరత్వానికి సాయం చేయడం దీని ఉద్దేశం. 

 అల్పాభివృద్ధి దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా సమతౌల్య అభివృద్ధి సాధన అభివృద్ధి విధానాలు, ప్రణాళికలను సమన్వయపర్చడం, ప్రాంతాల మధ్య వ్యాపారాన్ని ప్రోత్సహించడంప్రాజెక్టు ప్రణాళిక, నిర్వహణలో సాంకేతిక సహాయం. 
 ఏసియన్ డెవలప్​మెంట్ బ్యాంక్ ప్రతి సంవత్సరం ఏసియన్ డెవలప్​మెంట్ అవుట్​లుక్​ను ప్రచురిస్తుంది. 

ఇండియా అండ్ ఏడీబీ

ఇండియా ప్రారంభ సభ్యదేశం. నాలుగో అతిపెద్ద వాటాదారు. ఏసియన్ డెవలప్​మెంట్ బ్యాంక్ భారతదేశానికి 200లకు పైగా రుణాలను ఆమోదించింది. 

రవాణా రంగం: బిహార్ న్యూ గంగా బ్రిడ్జ్ ప్రాజెక్ట్
పట్టణ రంగం: అమృత్, స్మార్ట్ సిటీ
విత్తరంగం: సోలార్ రూప్ టాప్ పెట్టుబడుల పథకం
వ్యవసాయం, సహజ వనరుల రంగం: నీటి సమర్థవంత వినియోగం
అవస్థాపనా సదుపాయాల రంగం: వీసీఐసీ
భారత మూలధన వాటా 6.33 శాతం, ఓటింగ్ వాటా 5.36 శాతం.

ఈబీఆర్​డీ

యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్​స్ట్రక్షన్ అండ్ డెవలప్​మెంట్ 1991లో ఏర్పడింది. ఇందులో 71 సభ్య దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఇన్వెస్ట్​మెంట్ బ్యాంక్ సభ్యత్వం కలిగి ఉన్నాయి. 2018 నుంచి ఇండియా కూడా వాటాదారుగా ఉన్నది. భారతదేశం సభ్యదేశమైనా విత్తం తీసుకోలేదు. ముఖ్యంగా ఈ సంస్థ ప్రైవేట్ రంగ అభివృద్ధి రుణాలు ఇస్తుంది. ప్రధాన కేంద్రం లండన్ లో ఉన్నది.  ఈ సంస్థలో అతిపెద్ద వాటాదారు అమెరికా.