పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ డీ83 మెయిన్ కెనాల్‌పై ఉన్న బ్రిడ్జి ఇటీవల కురిసిన వర్షాలకు వారం కింది కూలిపోయింది. దీంతో రాకపోకలు నిలిపోయి రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్రిడ్జి మీదుగా ప్రతిరోజూ సుమారు 500 మందికి పైగా రైతులు, కూలీలు రాకపోకలు సాగిస్తుంటారు.
బ్రిడ్జి కూలడంతో నాలుగు కిలోమీటర్లు తిరిగి పొలాల వద్దకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. మరోవైపు బ్రిడ్జి కూలడంతో కూలీలు పనులకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులు మాత్రం కూలిపోయిన బ్రిడ్జి వద్ద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.