డార్క్​వెబ్​​లో డ్రగ్స్ తెప్పించి.. ఇన్​స్టాగ్రామ్​లో అమ్మకాలు

డార్క్​వెబ్​​లో డ్రగ్స్ తెప్పించి.. ఇన్​స్టాగ్రామ్​లో అమ్మకాలు
  • ముగ్గురు యువకుల అరెస్ట్, రూ.7 లక్షలకుపైగా సరుకు సీజ్
  • పరారీలో ఇద్దరు ప్రధాన నిందితులు

బడంగ్ పేట, వెలుగు: డార్క్​వెబ్​ ​ద్వారా సిటీకి డ్రగ్స్ తెప్పించి, సోషల్​మీడియా సహాయంతో అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ రాకెట్ గుట్టురట్టైంది. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకీలోని సాలార్ జంగ్ కాలనీకి చెందిన మహమ్మద్ ఇద్రిస్ సలీం తన బామ్మర్ది మహమ్మద్ అబ్బాస్​తో కలసి కొన్ని నెలలుగా డ్రగ్స్​ను డార్క్ వెబ్​ ద్వారా సిటీకి తెప్పిస్తున్నాడు. అనంతరం ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసి, ఇన్​స్టాగ్రామ్, స్నాప్ చాట్ తదితర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్ ద్వారా అమ్ముతున్నారు.  

యూపీఐ ద్వారా కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకొని, డ్రగ్స్ వారికి చేరిన వెంటనే సోషల్ మీడియాలో వివరాలను డిలీట్ చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం బాలాపూర్​లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాజేంద్రనగర్ హ్యాపీ హోమ్​కు చెందిన బండారి సునీల్ అలియాస్ సులేమాన్ (30), దారుసలాంకు చెందిన అస్లాం (32), నాంపల్లికి చెందిన మహమ్మద్ అక్రమ్( 30)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 170 గ్రాముల 34 ఓజీ గంజాయి ప్యాకెట్లు,  9 కిలోల ఎండు గంజాయి, 4 సెల్ ఫోన్​లు, ఓ కారుతోపాటు రెండు బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. 

వీటి విలురూ.7 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వీరిపై ఇప్పటికే గోల్కొండ, కార్ఖానా పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇద్రిస్, అబ్బాస్ పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని డీసీపీ సునీతారెడ్డి వెల్లడించారు. పట్టుబడిన ముగ్గురితోపాటు పరారీలో ఉన్న ప్రధాన నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్​రెడ్డి, బాలాపూర్ సీఐ సుధాకర్ ఉన్నారు.