- బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ
చేగుంట, వెలుగు: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో జరిగిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణలతో కార్యక్రమం రసాభాసగా మారింది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చేగుంట మండలానికి మంజూరైన 91 కల్యాణ లక్ష్మి చెక్కులను జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వేదిక పైకి రాగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రొటోకాల్‌కు విరుద్ధంగా అధికారిక కార్యక్రమ వేదికపై పార్టీ నాయకులు ఎలా కూర్చుంటారని ప్రశ్నించడంతో మంత్రి శ్రీనివాస్ రెడ్డిని వెనుక వరుసలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ముందుకు రావడంతో అధికారులు, పోలీసులు ప్రొటోకాల్ పాటించేలా చూడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనడంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు.
ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గెలుపొందిన ఎమ్మెల్యేలను పక్కనపెట్టి ఇన్చార్జిలతో కార్యక్రమాలు నిర్వహించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలతో కొనసాగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో జయచంద్ర రెడ్డి పాల్గొన్నారు.