అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు .. లోక్ సభ లో బోల్తా

అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు .. లోక్ సభ లో బోల్తా
  • సిటీలో బీఆర్ఎస్ కు16 మంది ఎమ్మెల్యేలు ఉన్నా దక్కని విజయం
  • నాలుగు లోక్ సభ సెగ్మెంట్లలో భారీగా 
  • క్రాస్ ఓటింగ్​ఒక్క చోట కూడా గెలుపొందని కారు పార్టీ అభ్యర్థులు 
  • బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపిన ఓటర్లు 
  • ఊహించని ఫలితాలు రావడంతో గులాబీ శ్రేణులకు షాక్

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్​ సిటీలో గులాబీ వికసించగా.. లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి వాడిపోయింది. అప్పుడు ఓటర్లు బీఆర్ఎస్​ను ఏకపక్షంగా గెలిపించారు. ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా కాంగ్రెస్​ హవా కొనసాగితే.. ఇక్కడ మాత్రం కారుకు పట్టం కట్టారు. గ్రేటర్ సిటీలో మొత్తం 24  సెగ్మెంట్లలో అత్యధికంగా 16 స్థానాల్లో బీఆర్ఎస్​ విజయం సాధించింది.గ్రేటర్​ సిటీలోనే ఆ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.  

మిగిలిన 7 సీట్లలో ఎంఐఎం, ఒకటి బీజేపీ గెలుచుకుంది.  ప్రస్తుత లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. మూడు లోక్ సభ సెగ్మెంట్లలో హైదరాబాద్​ను వదిలేస్తే మల్కాజిగిరి, సికింద్రాబాద్​లో బీజేపీ విజయం సాధించింది. ఊహించని విధంగా రెండు లోక్ సభ సెగ్మెంట్లలోని అసెంబ్లీ స్థానాల్లో కనీసం రెండోప్లేసును కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేక పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లోని ఆ పార్టీ ఓటు బ్యాంకు ఇప్పుడేమైంది..? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తింది. ఓటర్ల తీరు ఎందుకు మారిందనేది కూడా ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ ​సిటీలో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు ఘోరంగా ఓడిపోయిందనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది.  

 భారీగా క్రాస్​ ఓటింగ్​

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ నేతలేనని స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటర్లు భారీగా ఓట్లు వేసి గెలిపించగా.. ఇప్పుడు ఎందుకు ఓట్లు పడలేదనడానికి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యూత్, కొత్త ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇక స్లమ్ ఏరియాలు, మైనార్టీ ఓటర్లు అధికంగా కాంగ్రెస్​కు, బీసీలు, ఉద్యోగులు కూడా బీజేపీ, హస్తంకే ఓట్లు వేసినట్టు ఫలితాలను బట్టి చూస్తే కనిపిస్తుంది. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, పెన్షన్, గ్యాస్ సిలిండర్ పై రాయితీ వంటి పథకాలను అమలు చేయగా..  మహిళా ఓటర్లు ఎక్కువ ఆకర్షితులైనట్టు కూడా తెలుస్తోంది. 

సిటీలోని కొన్నివర్గాలు ముఖ్యంగా నార్త్​ ఇండియన్ వ్యాపారులు, మర్వాడీ, గుజరాతీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓట్లు వేసినా.. లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రధాని మోదీ చరిష్మాతో బీజేపీ వైపు మళ్లినట్టు తెలిసింది. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ కు వేయడంతోనే బీఆర్ఎస్​కు పెద్దగా ఓట్లుపడలేదు. కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లతో పోలిస్తే బీఆర్ఎస్​నుంచి పోటీ చేసిన వారు బలహీనమైన అభ్యర్థులుగా గుర్తించడం వంటివి కూడా కారణమై ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ వికసించినా, లోక్ సభకు వచ్చేసరికి వాడిపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.