
- కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు
- గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండ్
- ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న స్థానిక లీడర్లు
నిర్మల్, వెలుగు : కొన్ని నెలల కిందటి వరకు మూడు శాఖలకు మంత్రిగా పనిచేసి, నిర్మల్ జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించిన ఇంద్రకరణ్‌రెడ్డి ప్రస్తుతం ఒంటరిగా మిగిలారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన చేరికను స్థానిక కాంగ్రెస్ లీడర్లు వ్యతిరేకిస్తుండడంతో హైకమాండ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడం లేదు. ఆయన అనుచరులంతా ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా ఆయన మాత్రం రాజకీయాంగా ఒంటరి అయ్యారన్న చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌లోకి ఐకే రెడ్డి అనుచరులు
ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులంతా ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. చాలా ఏళ్లుగా ఇంద్రకరణ్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన సిర్పూర్ కాగజ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే వీరిద్దరూ ఇంద్రకరణ్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడంతో ఆయన సలహా మేరకే వీరు పార్టీ మారారన్న ప్రచారం జరిగింది. తర్వాత బీఆర్‌ఎస్ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి ఐకే రెడ్డి హాజరుకాకపోవడం, బీఆర్‌ఎస్ లీడర్లకు అందుబాటులో ఉండకపోవడంతో ఆయన కూడా పార్టీ మారుతారని ప్రచారం జరిగింది.
కానీ ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కాంగ్రెస్ లీడర్లు ఐకే రెడ్డి అనుచరులను మాత్రం చేర్చుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ, తాజా ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారు. మంగళవారం నిర్వహించిన మీటింగ్‌కు హాజరైన లీడర్లలో చాలా మంది ఇంద్రకరణ్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే కాంగ్రెస్‌లో చేరారు. నిన్న, మొన్నటి వరకు ఐకే రెడ్డి వద్ద నంబర్ టూ, త్రీలుగా కొనసాగి, అన్నీ తామై వ్యవహరించిన నేతలే ప్రస్తుతం ఆయనను వదిలేసి కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
నిర్మల్‌కు చెందిన ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎరబోతు రాజేందర్‌తో పాటు సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, సారంగాపూర్ మండలానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రవీందర్‌రెడ్డి, రాజ్ మహ్మద్, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తోపాటు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ చేరారు.
అలాగే దిలావర్‌పూర్ మండలంలో మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, కోడె రాజేశ్వర్, మామడ మండలానికి చెందిన వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డితో పాటు చాలామంది సీనియర్లు, సోన్ మండలానికి చెందిన పలువురు ఐకే రెడ్డి ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
చేరికకు స్థానిక లీడర్ల అడ్డు
బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ఇంద్రకరణ్ రెడ్డి నెల రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన చేరికను జిల్లాకు చెందిన కొందరు లీడర్లు అడ్డుకుంటున్నారు. ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఐకే రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సైతం దిగారు. క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఐకే రెడ్డి చేరిక వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టింది. అయితే ఆయన మాత్రం తన ప్రయత్నాన్ని విరమించడం లేదు.
మొదట మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ప్రయత్నం చేయగా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో కూడా ప్రయత్నాలు చేసినా హైకమాండ్ నుంచి ఎలాంటి పిలుపు అందలేదు. దీంతో మంగళవారం నిర్మల్‌లో తన అనుచరులతో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారం, పది రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని అనుచరుల సమక్షంలో ప్రకటించారు.