యాదగిరిగుట్టపై పొలిటికల్ డ్రామా.. ఆలయ ఈవోతో డీసీసీబీ మాజీ చైర్మన్ వాగ్వాదం

యాదగిరిగుట్టపై పొలిటికల్ డ్రామా.. ఆలయ ఈవోతో  డీసీసీబీ మాజీ చైర్మన్ వాగ్వాదం
  • సీఎం రేవంత్​రెడ్డిపై ఆరోపణలు
  • ‌‌‌‌ఆలయాన్ని కేసీఆర్​ కట్టారంటూ దురుసు ప్రవర్తన

యాదగిరిగుట్ట, వెలుగు: ఆధ్యాత్మికతకు నిలయమైన యాదగిరిగుట్టపై బీఆర్ఎస్​ నాయకులు సోమవారం పొలిటికల్ డ్రామాకు తెరతీశారు. ఆలయ నిబంధనల ప్రకారం కొండపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు. కానీ, అందుకు విరుద్ధంగా నోటికి పని చెప్పారు. ఆలయ ఈవో భాస్కర్ రావుకు వినతిపత్రం ఇచ్చేందుకు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి నాయకులతో కలిసి వచ్చారు.  అందరూ జై కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా, ఈవో ఆఫీస్ ఎదుటే  మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఏదీ చేతకాదంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. రూ.1,200 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ కట్టారన్నారు. 

స్వామివారి కల్యాణ సమయంలో ఈవో  ప్రొటోకాల్​ పాటించలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డిని వీఐపీ గ్యాలరీలో ఎక్కడో వెనకాల కూర్చోబెట్టి.. ఎలాంటి ప్రొటోకాల్ లేని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోదరుడు శంకర్ ను ఎంపీ, కలెక్టర్ తో మొదటి వరుసలో ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే సోదరుడు ఎలా తీసుకొస్తారన్నారు. 

 అయితే, తాను ప్రొటోకాల్​ ప్రకారమే పని చేశానని చెబుతూ ఈవో వెళ్లిపోతుంటే ఆయన  ఆఫీస్​ఎదుటే బైఠాయించి, నిరసన తెలిపారు. ఈవో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో రెండు గంటలపాటు ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ పాపట్ల నరహరి, నాయకులున్నారు.