
- కండువాలు కప్పి ఆహ్వానించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య క్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం గాంధీ భవన్లో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పోనుగోటి సోమేశ్వరరావు, ధరావత్ రాజేశ్ నాయక్తో పాటు మరికొందరు నాయకులు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పీసీసీ చీఫ్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడాదిన్నరలోనే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ లన్నింటిని దశల వారీగి అమలు చేస్తూ వస్తున్నదని చెప్పారు.
సన్నబియ్యం పథకంతో పేదలు తమ ఇండ్లలో పండుగ జరుపుకుంటున్నారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అందరు కలిసికట్టుగా పార్టీ గెలుపుకోసం ఇప్పటి నుంచే పనిచేయాలని సూచించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మా అత్త, కోడళ్లను తక్కువగా అంచనావేస్తూ.. రాజకీయంగా ఇంకా ఏదో ఆశతో ఉన్నారని, ఆయన ఆ ఆశలు వదులుకుంటే మంచిదని స్పష్టం చేశారు. చేరికలు ఇంకా కొనసాగుతాయని
అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి కాం గ్రెస్ నేతలు పాల్గొన్నారు.