- ఎనిమిది ప్రశ్నలతో కూడిన పోస్టర్లను నందిపేటలో అతికించిన బీఆర్‌ఎస్ నాయకులు
నందిపేట, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ నందిపేట మండల కేంద్రంలో బుధవారం వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ‘రూపాయికి వైద్యం అందిస్తానని చెప్పావ్.. ఎక్కడా ? పేదలకు ఊరికి పది ఇండ్లు సొంత ఖర్చులతో కట్టిస్తానన్నావ్..? నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి హైదరాబాద్ వస్తానంటే వద్దంటావ్.. ఎందుకు ? పేదలంటే చులకనా ? యువతకు ఉపాధి అన్నావ్..? హిందుత్వం పేరుతో రెచ్చగొట్టి హిందూ దేవాలయాలకు ఎన్ని చందాలు ఇచ్చావ్.. ధనవంతులను రావద్దంటావ్.. పేదలకు సహాయం చేయవు’ అంటూ ఎనిమిది ప్రశ్నలతో పోస్టర్లపై ముద్రించి ప్రధాన కూడళ్లలో అతికించారు.
ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ లీడర్లు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సై చిరంజీవి ప్రధాన రోడ్లపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి వాటిని అతికించింది బీఆర్‌ఎస్‌కు చెందిన జోర్పూర్ రాము, మచ్చర్ల విజయ్ సామ్రాట్‌లుగా గుర్తించి కేసు నమోదు చేశారు.