- మహబూబ్‌నగర్ జిల్లాలోని 27 ఎకరాలకు ఎసరు
- ధరణి’లోని లొసుగులను వాడుకుని చక్రం తిప్పిన యూత్లీడర్
- సర్వే నంబర్‌కు బై నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు
- వైకుంఠధామాన్ని కూల్చేసినా పట్టించుకోని అధికారులు
మహబూబ్‌నగర్, వెలుగు:మహబూబ్‌నగర్ జిల్లాలోని నేషనల్హైవే– 44(హైదరాబాద్ – బెంగళూరు)ను ఆనుకొని ఉన్న భూముల ధరలకు రెక్కలు రావడంతో, వాటిపై బీఆర్ఎస్ లీడర్ల కన్ను పడింది. అధికారులను మ్యానేజ్చేస్తూ.. సర్వే నంబర్ కు బై నంబర్లతో లావుని పట్టా భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకొంటున్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా వదలడం లేదు. బాలానగర్మండలంలో ఏకంగా వైకుంఠధామం కోసం కట్టిన నిర్మాణాలను కూల్చేసి వెంచర్వేసేందుకు స్కెచ్వేస్తున్నారు. హైవేకు అరకిలోమీటరు దూరంలో ఉన్న బాలానగర్మండల కేంద్రంలో ప్రస్తుతం ఎకరం భూమి రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు పలుకుతోంది. హైవే నుంచి రెండు, మూడు కిలోమీటర్లు లోపలికి ఉన్న భూములు రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు పలుకుతున్నాయి. ఇదే అదునుగా బీఆర్ఎస్లీడర్లు రెచ్చిపోతున్నారు.
ప్రభుత్వ భూమే అని తేల్చినా..
బాలానగర్ పెద్ద చెరువు దిగువన సర్వే నంబర్ 118లో 27.2 ఎకరాల్లో లావుని పట్టా భూములు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు 2019లో ఫీల్డ్‌సర్వే చేసి, అవి ప్రభుత్వ భూములే అని నిర్ధారించారు. ‘ధరణి’ పోర్టల్ లోనూ అవి ప్రభుత్వ భూములే అని చూపిస్తోంది. అదే ఏడాది అందులోని 30 గుంటల భూమిని వైకుంఠధామం కోసం కేటాయించగా, డిసెంబరు 2న జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి రూ.9.46 లక్షలు కేటాయించారు. దాదాపు రెండేళ్ల పాటు పనులు కొనసాగినప్పటికీ ఆ భూములకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. నెల రోజుల కింద వైకుంఠధామం కోసం కట్టిన షెడ్లు, గదులను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు.
పైగా వైకుంఠధామం నిర్మించిన స్థలం తమదని కొందరు బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే బాలానగర్ వాగు దగ్గర, సర్వే నంబర్ 274లో కొత్తగా మరో వైకుంఠధామం నిర్మించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే నంబర్ 118లోని 27 ఎకరాల లావుని పట్టా భూములు ఎన్‌హెచ్–44కు అరకిలోమీటరు దూరంలో ఉండడంతో కొందరు బీఆర్ఎస్లీడర్లు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూముల విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. బీఆర్ఎస్కు చెందిన యూత్ లీడర్ ఒకరు రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే నంబర్118కు సమీపంలోని భూముల రైతులను, స్థానిక అధికారులను మేనేజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని అధికార పార్టీ బడా లీడర్లకు వాటాలు ముట్టడంతో సైలంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు రెవెన్యూ ఆఫీసర్ల సపోర్టుతోనే యూత్ లీడర్కబ్జా వ్యవహారాన్ని చక్కబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
అలుగు, కెనాల్ ఖతం
వైకుంఠధామం నిర్మాణాలు కూల్చిన చోట బీఆర్ఎస్యూత్ లీడర్త్వరలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడి భూమిని చదును చేశారని తెలుస్తోంది. మొన్నటిదాకా ఎగువన ఉన్న పెద్ద చెరువు అలుగు పారితే సదరు భూమి మీదుగా పారేది. సమీపంలోని పంట పొలాలకు సాగునీరు అందించేందుకు కాల్వ ఉండేది. అయితే కబ్జాదారులు సదరు కాల్వను, అలుగు పారే ప్రాంతాన్ని పూర్తిగా మట్టితో నింపేశారు.
ఆయకట్టు రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిని కూడా మేనేజ్ చేశారు. రైతుల పట్టా భూముల నుంచి తాత్కాలికంగా మరో కాల్వను తవ్వించారు. ముందుగానే కాల్వ తవ్వకంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని రైతుల నుంచి సంతకాలు పెట్టించి అధికారులకు అందజేశారు. యూత్లీడర్వెంచర్వేస్తే తమ భూముల రేట్లు కూడా పెరుగుతాయన్న ఆశతో రైతులు మౌనంగా ఉండిపోయారు.
ఎవరు కూల్చారో తెల్వదు
సర్వే నంబర్118లో ఉన్నది ప్రభుత్వ భూమి అనుకొని అప్పటి ఆర్ఐ, సర్వేయర్లు వైకుంఠధామానికి అలాట్ చేశారు. తర్వాత అది తమ పట్టా భూమి అని జంగోజి అనే వ్యక్తి వారసులు ఆర్డీఓకు ఫిర్యాదు చేసి ఎన్ఓసీ తెచ్చుకున్నారు. దీంతో అప్పటికే వైకుంఠధామం ఏర్పాటులో భాగంగా కట్టిన రెండు షెడ్లు, రెండు స్నానపు గదులు, మరో రూమ్ ను వదిలేసి, వేరే చోట వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదట కట్టిన వాటిని ఎవరు కూల్చారో తెలియదు. కూల్చేసిన నిర్మాణాలను, మట్టితో పూడ్చివేసిన పెద్ద చెరువు కాల్వ ప్రదేశాన్ని పరిశీలించాం. అక్కడికి 100 మీటర్ల దూరంలో కొత్తగా పంట కాల్వ తవ్వినట్లు గుర్తించాం. ఇరిగేషన్ అధికారుల పర్మిషన్‌తోనే తాము కాల్వ తవ్వుకున్నామని రైతులు అంటున్నారు. ఈ విషయాలపై కలెక్టర్‌కు నివేదిక పంపిస్తాం. వైకుంఠధామం కూల్చివేతపై ఎంపీడీఓ ఇప్పటికే డీపీఓకు రిపోర్ట్ పంపారు. కలెక్టర్ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– బి.శ్రీనివాసులు, తహసీల్దార్, బాలానగర్