- కాంగ్రెస్లోకి గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి
- 15 మంది కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు సైతం..
- హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేయర్
- ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన ఏడుగురు కార్పొరేటర్లు
వరంగల్, వెలుగు : వరంగల్ బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఏడుగురు కార్పొరేటర్లు ఇప్పటికే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరగా, ఇప్పుడు మేయర్ గుండు సుధారాణి, మరో 15 మంది కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మేయర్ తో పాటు కార్పొరేటర్లు, లీడర్లు సీఎం రేవంత్‍రెడ్డి, ఇతర పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇందులో భాగంగా మేయర్ సుధారాణి ఆదివారం మంత్రి పొంగులేటితో కలిసి హైదరాబాద్ లో సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్కు తరలిన కార్పొరేటర్లు
అసెంబ్లీ ఎన్నికల టైంలో గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. తర్వాత అనూహ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద ఆనంద్, 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, 48వ డివిజన్ కార్పొరేటర్ షర్తాజ్ బేగం, 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్ తో పాటు, మరో ఐదుగురు మాజీ కార్పొరేటర్లు, ఉద్యమ కాలం నాటి సీనియర్ లీడర్లు బీఆర్ఎస్ను వీడారు. తాజాగా వరంగల్ తూర్పు
వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోని 15 మంది కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందులో కావటి కవిత (12వ డివిజన్), సురేష్ జోషి (13వ డివిజన్), వస్కుల బాబు (18వ డివిజన్), ఓని స్వర్ణలత భాస్కర్ (19వ డివిజన్), ఎండీ.ఫుర్కాన్ (21వ డివిజన్), బస్వరాజు కుమారస్వామి (22వ డివిజన్), చింతాకుల అనిల్ (27వ డివిజన్), గందె కల్పన నవీన్ (28వ డివిజన్), పల్లం పద్మ (32వ డివిజన్), ముష్కమల్ల అరుణ (33వ డివిజన్), దిడ్డి కుమారస్వామి (34వ డివిజన్), సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ (35వ డివిజన్), బైరబోయిన ఉమా దామోదర్ (38వ డివిజన్)
సిద్దం రాజుబాబు (39వ డివిజన్), పోశాల పద్మ (41వ డివిజన్) ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్ తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్.. జాబితాలో ఉన్న కొందరు కార్పొరేటర్లను పార్టీ మారకుండా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు కార్పొరేటర్లు సైతం పార్టీ మారే ఆలోచన ఉన్నప్పటికీ, లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భర్త వద్దంటున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ఖాతాలో మేయర్ పీఠం
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రెండు టర్మ్ లలో గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం గులాబీ పార్టీ చేతుల్లోనే ఉంది. బల్దియాలో 66 డివిజన్లుండగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 48 స్థానాల్లో గెలిచింది. గుండు సుధారాణి మేయర్‍గా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత ఇతర పార్టీలకు చెందిన ముగ్గురిని చేర్చుకోవడంతో బీఆర్ఎస్ బలం 51కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంతో సీన్ మారింది. గ్రేటర్ వరంగల్ కు చెందిన 8 మంది కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీ మారారు. ఇందులో ఏడుగురు కాంగ్రెస్ లో చేరగా, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్న కొడుకు
60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ బీజేపీలో చేరారు. నగరంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా తమ మార్క్ ఉండాలన్న ఉద్దేశంతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్లో గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లను పార్టీ మారేలా చేయడంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, కొండా సురేఖ మురళీ దంపతులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో 15 మంది కార్పొరేటర్లు కారు దిగి హస్తానికి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. మేలో అవిశ్వాసం పెట్టి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ మేయరే పార్టీలో చేరుతుండడంతో గ్రేటర్ పీఠం కాంగ్రెస్ చేతికి వచ్చినట్లయ్యింది.
గతంలోనే ప్రయత్నాలు
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరాలని మొదట్లో ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కొండా దంపతులతో పాటు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఒప్పుకోలేదు. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన గుండు సుధారాణి గతంలో తాను పనిచేసిన టీడీపీ సీనియర్ల సహకారంతో హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చెసినట్లు తెలిసింది. గతంలో ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు ప్రస్తుత సీఎం రేవం త్‍రెడ్డి, ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి సీతక్క, పరకాల, భూపాలపల్లి, డోర్నకల్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకా శ్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ
డాక్టర్ రామచంద్రునాయక్‍లతో కలిసి పనిచేసింది. ఈ క్రమంలో హైకమాండ్ పెద్దలు లోకల్ ఎమ్మెల్యేలు, లీడర్లతో మాట్లాడి సుధారాణి చేరికకు ఒప్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో 8 మంది మేయర్లను కాంగ్రెస్ లో చేర్చుకునేలా ప్రయత్నాలు చేస్తుండగా, ఇందులో భాగంగానే సుధారాణి చేరికను స్వాగతించినట్లు తెలుస్తోంది. మేయర్ పదవిని కంటిన్యూ చేసే విషయంలో సుధారాణికి కమిట్‍మెంట్ ఇవ్వలేదని, ఎంపీ ఎలక్షన్ల తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.