- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ డిమాండ్
- రైతులు విలువైన భూములు కోల్పోతున్నారని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ ను మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలబెట్టుకోవాలని తెలిపారు. ఉత్తరభాగంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. శనివారం హరీశ్ రావును ఆయన నివాసంలో ఆర్ఆర్ఆర్ తో భూములు కోల్పోతున్న రైతులు, దివ్యాంగ పోరాట సమితి నేతలు కలిశారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చౌటుప్పల్ వద్ద జంక్షన్రింగు గతంలో 78 ఎకరాల్లో ఉండగా.. ఇప్పుడు దానిని 184 ఎకరాలకు పెంచడంతో పేదలు భూములు, ప్లాట్లు కోల్పోతున్నారని పేర్కొన్నారు. నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారని అన్నారు. వెంకట్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆర్ఆర్ఆర్అలైన్మెంట్ను మార్చాలని ధర్నాలు చేశారని, ఇప్పుడేమో పోలీసులతో నిర్బంధంగా సర్వేలు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. చేయూత పింఛన్ దారుల మహాధర్నా కార్యక్రమానికి పార్టీ తరఫున మద్దతిస్తామన్నారు.