సుందరీకరణ పేరుతో పేదల బతుకులను కూలుస్తరా : హరీశ్ రావు

సుందరీకరణ పేరుతో పేదల బతుకులను కూలుస్తరా :  హరీశ్ రావు
  • మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఎక్కడివి?: హరీశ్
  • ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్న 

హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: మూసీ సుందరీకరణ పేరుతో పేదల బతుకులను కూలుస్తరా? అని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని ప్రభుత్వం.. రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపడుతున్నదని, అవి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లోని హసీంనగర్ లో, బండ్లగూడ జాగీరు పరిధిలోని గంధంగూడ, బైరాగిగూడలో మూసీ బాధితులను హరీశ్ రావు ఆదివారం పరామర్శించారు.

విశాల్‌నగర్‌ కాలనీ నుంచి కేంద్రీయ విహార్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అలాగే తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నో సమస్యలను వదిలేసి, మూసీ మీద పడి పేదల ఉసురు తీస్తున్నదని హరీశ్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, ఎందుకీ కూల్చివేతలు అని ప్రశ్నించారు. పేదవాళ్ల రక్తం, కన్నీళ్ల మీద మూసీ సుందరీకరణ చేస్తారా? అని ఫైర్ అయ్యారు. పేదల ఇండ్లను కూల్చనియ్యమని, బుల్డోజర్లను అడ్డుకుంటామని చెప్పారు. ‘‘యూపీలో యోగి ఆదిత్యనాథ్ ది బుల్డోజర్ ప్రభుత్వమని రాహుల్ అంటున్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బుల్డోజర్లను ఉపయోగిస్తున్నది కదా?” అని ప్రశ్నించారు. 

టాయిలెట్స్ కంటే సుందరీకరణ ముఖ్యమా? 

మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. ఆడ పిల్లలకు టాయిలెట్స్ కట్టించడం ముఖ్యమా? లేక మూసీ సుందరీకరణ ముఖ్యమా? అని ప్రశ్నించారు. ‘‘స్కూళ్లలో పిల్లలకు టాయిలెట్స్ లేవు. ఒకే టాయిలెట్ వద్ద వందల మంది లైన్‌లో నిల్చున్న సంఘటనలు చూస్తున్నాం. ఎస్సీ, బీసీ హాస్టల్స్​లో మెస్ చార్జీలను 7 నెలలుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం వద్ద పైసలు ఎక్కువుంటే ముందు ఈ సమస్యలు పరిష్కరించాలి” అని సూచించారు.

హైడ్రా పుణ్యమా అని ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారన్నారు. మూసీ సందరీకరణ పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయొద్దన్నారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.