
- రాష్ట్ర హక్కులపై ప్రభుత్వానికి సోయిలేదు: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో ఏపీ ప్రభుత్వం 74 శాతం నీళ్లను వాడుకున్నా.. సీఎం, మంత్రులు నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హెచ్చరించిన తర్వాత కూడా ఏపీ కృష్ణా జలాలను వాడుకున్నదని..ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 24 శాతం నీళ్లను కూడా వాడుకోలేక పోయిందని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లోని రెడ్ రోజ్ ప్లాజాలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ జలదోపిడిపై కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
తాగునీటికి కూడా కటకట ఏర్పడే పరిస్థితి ఉన్నా మంత్రులు సమీక్షలు చేయడం లేదన్నారు. తెలంగాణ హక్కులపై సోయి లేకుండా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని హెచ్చరించారు. మరో పెద్ద పోరాటానికి తెలంగాణ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయంలో 38 శాతానికి పైగా కృష్ణా జలాలను వాడుకున్నట్లు ఆయన గుర్తుచేశారు.