ఒక ఘటనపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌‌లు చెల్లవు

  • పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్‌ జిల్లా లగచర్ల సంఘటనకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఒకే సంఘటనకు సంబంధించి ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదంటూ శుక్రవారం తీర్పు వెలువరించింది. వికారాబాద్‌ జిల్లా బొమ్మరాస్‌పేట పోలీసు స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కొట్టివేసింది.

ఫార్మా సిటీ భూ సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా లగచర్లలో కలెక్టర్‌తో పాటు అధికారులపై జరిగిన దాడి ఘటనలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు వెలువరించారు. మూడు ఫిర్యాదుల్లో పట్నం నరేందర్‌ రెడ్డి పేరు లేదని, కేవలం కుట్ర పన్నారనే ఆరోపణ తప్ప మరెలాంటివి లేవన్నారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశం, సమయం ఒక్కటేనని, ఇదే విషయంపై అధికారులు 2, 3, 4 గంటలకు వేర్వేరుగా ఫిర్యాదులు ఇవ్వడంతో వాటిపై బొమ్మరాస్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.

ఎమ్మార్వో, డీసీఆర్‌బీ డీఎస్పీ బాధ్యతాయుతమైన అధికారులని, వారు స్వయంగా ఫిర్యాదు రాసి ఇవ్వాల్సి ఉండగా పోలీసు రైటర్‌ రాసిన ఫిర్యాదుపై సంతకం చేశారన్నారు. వారు కనీసం సంఘటన గురించి రైటర్‌కు వివరాలు కూడా చెప్పలేదన్నారు. గతంలో జరిగిన సంఘటనపై నమోదు చేసిన వివరాలనే మిగిలిన రెండు ఫిర్యాదుల్లోనే రైటర్‌ పేర్కొన్నారని, దీన్ని పరిశీలించకుండా అధికారులు సంతకం చేశారని చెప్పారు. వాస్తవాలను పరిశీలిస్తే పిటిషనర్‌ను కేసులో ఇరికించాలని చూస్తున్నట్లుగా ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

 వికారాబాద్‌ సబ్‌ డివిజనల్‌ ఆఫ్‌ పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు మాత్రమే దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దుద్యాల్‌ ఎమ్మార్వో, వికారాబాద్‌ డీసీఆర్‌బీ డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ 154, 155లను కొట్టివేశారు. ఈ రెండు కేసుల దర్యాప్తులో భాగంగా సాక్షుల నుంచి ఏవైనా వాంగ్మూలాలను నమోదు చేస్తే వాటిని మొదటి కేసులో వాంగ్మూలాలుగా తీసుకోవచ్చన్నారు.