
- సుప్రీంకోర్టు తీర్పు వల్లే బాటలు పడ్డాయి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్లే వర్గీక రణకు బాటలు పడ్డాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్.. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని చెప్పారు. దళితుల మధ్య పంచాయితీ పెట్టవద్దని, ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి కవిత సూచించారు.
గురువారం తన నివాసంలో దళితబంధు సాధ న సమితి అధ్యక్షుడు మహేశ్కోగిల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి, వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారని, వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు లింక్ పెడుతున్నారన్నారు. వర్గీకరణ వంకతో జాబ్ క్యాలెండర్ అమలు నిలిపి వేయొద్దని సూచించారు.