- టికెట్టుకోసం తాజాలు, మాజీలు ప్రయత్నాలు
- మంత్రి కేటీఆర్‌ను వేర్వేరుగా కలిసిన భిక్షమయ్య, కుంభం
యాదాద్రి, వెలుగు : యాదాద్రి కారులో ఆశవాహుల లోడ్ పెరిగిపోయింది. అసెంబ్లీ టికెట్ ఎవరిని దక్కుతుందో తెలియని పరిస్థితి తలెత్తింది. తాజా లీడర్లు, మాజీ లీడర్లు ఎవరికి వారు పోటా పోటీగా పార్టీ పెద్దలను కలుస్తున్నారు. కేసీఆర్ నుంచి పిలుపురాగానే కారెక్కిన మాజీ ఎమ్మెల్యేలు, పరపతి కలిగిన లీడర్లకు ఇప్పుడు నియోజకవర్గ పార్టీలో ఉబ్బరిస్తోంది. ఒకరిద్దరు దిగిపోవడానికి రెడీ అవుతున్నారు. మరికొందరు కారు ఎందుకు ఎక్కామని మధనపడిపోతున్నారు.
నియోజకవర్గాలు రెండు.. ఆశలు మెండు
తెలంగాణ ఏర్పడకముందు ఆలేరులో బలంగా ఉన్న బీఆర్ఎస్, తెలంగాణ ఏర్పడిన తర్వాత భువనగిరిలోనూ బలపడింది. 2014 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి 2017లో బీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు 2021లో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌లో బలమైన లీడర్‌గా ఉన్న డీసీసీ అధ్యక్షుడైన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇటీవలే కారెక్కారు.
అందరూ ఆశవాహులే
జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రెండోసారి గెలిచారు. మూడోసారి కూడా టికెట్ దక్కించుకొని గెలవాలని భావిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన బూడిద భిక్షమయ్య గౌడ్, మోత్కుపల్లి నర్సింహులుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. బీఆర్ఎస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో ప్రస్తుత ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలిందన్నారు. మోత్కుపల్లి
నర్సింహులు, బూడిద భిక్షమయ్య గౌడ్, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్నారు.
టికెట్ వచ్చేది ఎవరికి..?
ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ ప్రముఖ లీడర్లందరూ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే వారేకాకా, ఆర్థికంగా బలంగా ఉన్నవారే. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ బీఆర్ఎస్లో మొదలైంది. తాజా ఎమ్మెల్యేలు, ఆశావాహులు పోటాపోటీగా పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఇటీవల మంత్రి కేటీఆర్ కలిశారు. ఆ తర్వాత ఆలేరు ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా భువనగిరి లీడర్ కుంభం అనిల్‌కుమార్ రెడ్డి శుక్రవారం కేటీఆర్‌ను కలిశారు.
ఉందామా? పోదామా?
కారు ఎక్కనైతే ఎక్కారు కానీ, ఎక్కిన తర్వాత ఇలా టైట్ అవుతుందని ఊహించని లీడర్లు ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. పదవులపై హామీ ఇచ్చి.. అమలుపై స్పష్టత లేకపోవడంతో బీఆర్ఎస్లో ఉందామా పోదామా అని డైలామాలో పడ్డట్టు తెలుస్తోంది. పిలవగానే బీఆర్ఎస్లో ఎందుకు చేరామా? అని కొందరు లీడర్లు మదనపడుతున్నారని అన్నారు.
ఇప్పటికే లోడ్‌తో ఉన్న కారులో తాజా అనిల్ చేరడంపై లీడర్లు అసంతృప్తిలో ఉన్నట్టు పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తనకు తొమ్మిదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని బీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీని వీడే ప్రయత్నాల్లో ఉన్నారు.